బిహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. కోటి ప్రభుత్వ ఉద్యోగాలతో NDA మేనిఫెస్టో విడుదల

by Kema Shiva Kumar |

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

బిహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. కోటి ప్రభుత్వ ఉద్యోగాలతో NDA మేనిఫెస్టో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇవాళ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హెచ్‌ఏఎం(ఎస్) నేత జీతన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుశ్వాహా, ఇతర నేతలు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని, కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామంటూ హామీ ఇచ్చింది. నైపుణ్య గణన ప్రక్రియ చేపట్టి స్కిల్‌ బేస్డ్ జాబ్‌లు ఇస్తామని ఎన్‌డీఏ కూటమి తెలిపింది.

రూ.1 లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాలు..

మహిళా సాధికారతలో భాగంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 1 కోటి మంది మహిళలను సంవత్సరానికి రూ.1 లక్ష పైగా సంపాదించే దీదీలను ‘లఖ్‌పతి దీదీలు’గా మారుస్తామని అన్నారు. బిహార్‌లోని అత్యంత వెనుకబడిన తరగతులకు లక్ష్యంగా ఆర్థిక, సామాజిక మద్దతు అందిస్తాం. వివిధ ఈబీసీ వృత్తుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి పంట సీజన్‌కు రూ.3 వేలు, సంవత్సరానికి మొత్తం రూ.9 వేలు అందజేస్తామని అన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోని ప్రధాన పంటలు (వరి, గోధుమలు, పప్పులు, మొక్కజొన్న) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్‌పీ ధరలకు విక్రయిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి నీటి పారుదల, గిడ్డంగులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పాట్నాలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు

మత్స్య పరిశ్రమకు కొత్త క్లస్టర్లు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలతో రైతులు, మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలు, ఆదాయం పెంచుతామని అన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, బిహార్‌కు ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీని పెంచేందుకు 7 కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, 3,600 కి.మీ. రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ, 4 కొత్త నగరాల్లో మెట్రో సేవలు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో ర్యాపిడ్ రైల్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేపడతామని తెలిపారు. అదేవిధంగా బిహార్ నుంచి విదేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి పట్నా సమీపంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని చేపడుతామని తెలిపారు. దర్భంగా, పూర్నియా, భగల్‌పూర్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు. పాఠశాలల్లో ఆధునిక స్కిల్ ల్యాబ్‌లు, పౌష్టిక ఉదయం భోజనం, మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తామని తెలిపారు. ‘పంచామృత్ హామీ’లో భాగంగా పేదలకు ఉచిత రేషన్, ప్రతి కుటుంబానికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, అర్హుల కుటుంబాలకు సామాజిక భద్రతా పింఛన్లు అందజేస్తామని ఎన్‌డీఏ తన మేనిఫెస్టో పొందుపరిచింది.

Next Story