ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. రూ.18 కోట్లు ఆదా!

by Prasad Jukanti |

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా మలేషియా ప్రభుత్వం రూ.18 కోట్ల ఇంధన సబ్సిడీని ఆదా చేసింది. ఆగస్టు 1 నుండి హైబ్రిడ్ వర్కింగ్ విధానం అమల్లోకి తేబోతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. రూ.18 కోట్లు ఆదా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అవకాశం కల్పించడం ద్వారా ఓ ఆసియా దేశం ఏకంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ ఖజానాపై ఇంధన సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేందుకు మలేషియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వినూత్న పాలసీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆ దేశ ప్రభుత్వం ఏకంగా 18 కోట్ల రూపాయల (73 లక్షల మలేషియా రింగిట్స్) సబ్సిడీ సొమ్మును ఆదా చేయడమే కాకుండా, 40 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి:

మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టాన్ శంసుల్ అజ్రీ అబు బకర్ ఈ పథకం విజయవంతం కావడంపై వివరాలు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 6,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందారని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం వల్ల ఆఫీసులకు రానుపోను వాడే వాహనాల పెట్రోల్ వినియోగం గణనీయంగా తగ్గిందని, తద్వారా ప్రభుత్వం పెట్రోల్‌పై ఇచ్చే సబ్సిడీ భారం భారీగా తగ్గిందని వెల్లడించారు.

ఆగస్టు 1 నుండి హైబ్రిడ్ వర్కింగ్ విధానం:

వర్క్ ఫ్రమ్ హోమ్ విజయవంతం కావడంతో, మలేషియా ప్రభుత్వం ఆగస్టు 1 నుండి మరో కొత్త అడుగు వేయబోతోంది. 'హైబ్రిడ్ వర్కింగ్ డే' (HWD) పేరిట సరికొత్త పని విధానాన్ని తీసుకురానుంది. దీని ప్రకారం ఉద్యోగులు ఆఫీసు, ఇల్లు రెండింటి నుంచీ పని విభజన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం కింద ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రోజులు ఇంటి నుండి లేదా ప్రత్యామ్నాయ ప్రాంతాల నుండి పని చేయవచ్చు. ఇంధన సబ్సిడీ ఖర్చులను తగ్గిస్తూనే, ప్రభుత్వ ఉత్పాదకతను స్థిరంగా ఉంచడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.

లాంగ్ వీకెండ్స్ కు బ్రేక్:

అయితే ఈ హైబ్రిడ్ సదుపాయాన్ని ఆసరగా చేసుకుని ఉద్యోగులు సుదీర్ఘ సెలవులు (లాంగ్ వీకెండ్స్) ప్లాన్ చేసుకోకుండా ప్రభుత్వం కీలక నిబంధన పెట్టింది. వారాంతపు సెలవులు (శని, ఆదివారాలు) లేదా ప్రభుత్వ సెలవు దినాలకు ముందు రోజు, ఆ తర్వాత రోజుల్లో హోమ్ ఆప్షన్ ఎంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఉదాహరణకు శని, ఆదివారాలు సెలవు ఉంటే.. సోమవారం, శుక్రవారం రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతించరు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అటు ఖర్చు ఆదాతో పాటు ఇటు నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story