- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళపై ‘మత్తు’ పంజా.. పంజాబ్‌కు మూడింతలు కేసులు ఇక్కడే.. తెలంగాణలో ఎన్ని కేసులు?
ప్రకృతి వైపరిత్యాలకుతోడు కేరళపై ఇప్పుడు డ్రగ్స్ పంజా(Drugs) పడింది. కేరళలో విస్తారంగా మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. వాటిని వినియోగిస్తున్నారు. అత్యధిక అక్షరాస్యత రికార్డున్న కేరళ ఇప్పుడు మత్తులో ఓలలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు(Parliament)లో వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

దిశ, నేషనల్ బ్యూరో: మనోహర ప్రకృతి సోయగాలతో కేరళ(Kerala) మనసును ప్రశాంతం చేస్తుంది. దేవభూమిగా పేరున్న ఈ రాష్ట్రం ప్రతియేటా ప్రకృతి విపత్తును ఎదుర్కొంటుంది. వరదలతో సతమతమవుతుంది. ప్రకృతి వైపరిత్యాలకుతోడు కేరళపై ఇప్పుడు డ్రగ్స్ పంజా(Drugs) పడింది. కేరళలో విస్తారంగా మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. వాటిని వినియోగిస్తున్నారు. అత్యధిక అక్షరాస్యత రికార్డున్న కేరళ ఇప్పుడు మత్తులో ఓలలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు(Parliament)లో వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. డ్రగ్స్ అంటే కేరాఫ్‌గా చెప్పుకునే ఉత్తరాది పంజాబ్(Punjab) రాష్ట్రానికి అందనంత స్థాయిలో కేరళలో డ్రగ్స్ మహమ్మారి విశృంఖలరూపాన్ని తీసుకుంది. పంజాబ్ కంటే మూడు రెట్లు అధికంగా కేసులు కేరళలో రికార్డు అవుతున్నాయి. టాప్ థర్డ్ ప్లేస్‌లో మహారాష్ట్ర నిలుస్తున్నది. అయితే, తెలంగాణలోనూ డ్రగ్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.
వినియోగించడానికి లేదా రవాణా చేయడానికి డ్రగ్స్‌తో పట్టుబడిన కేసుల సంఖ్య ఆధారంగా ఈ వివరాలు తెలియవస్తున్నాయి. ఈ కేసులు నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) యాక్ట్, 1985 కింద నమోదవుతాయి. 2017 నుంచి 2024 మధ్య కేరళలో ఈ కేసులు నమోదైన విధం చూస్తే అక్కడ మత్తుపదార్ఘాలు ఊహించనిస్థాయిలో సరఫరా అవుతున్నట్టు, వినియోగిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. 2021లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద 5,695 కేసులు నమోదవ్వగా 2022లో 26,619 కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2023లో ఇవి 30,000 కేసులు నమోదయ్యాయి. 2024లో 27,701 కేసులు రిపోర్ట్ అయ్యాయి.
ఈ రాష్ట్రాల్లో కూడా ఆందోళనకరంగానే
కేరళతోపాటు పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇవి గణనీయంగా పెరగడం ఆందోళనకరం. 2023లో రెండో స్థానంలో మహారాష్ట్ర(కేరళలో దాదాపు సగం కేసులతో) నిలిచింది. 2024లో రెండో స్థానమున్న రాష్ట్రానికి కేరళ మరింత దూరంగా జరిగింది. కేరళలో మూడో వంతు కేసులతో పంజాబ్ రెండో స్థానంలో ఉన్నది. ఎన్‌పీఎస్ఏ యాక్ట్ కింద రెండు రకాల కేసులుంటాయి. డ్రగ్స్ సేవించడానికి, రవాణా చేయడానికి కలిగి ఉన్నందుకు ఈ కేసు నమోదు చేస్తారు. 2022లో కేరళలో 94 శాతం కేసులు సేవించడానికి కలిగి ఉన్నందుకే నమోదవ్వడం గమనార్హం. అదే పంజాబ్‌లో రవాణా చేయడానికి డ్రగ్స్‌తో పట్టుబడ్డు కేసులు అధికం.
గ్రామీణంలోనూ భారీగానే
కర్ణాటకలో బెంగళూరు, తమిళనాడులో చెన్నై వంటి పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతాయి. కానీ, కేరళలో ఈ మహమ్మారి కేవలం పట్టణాలకు పరిమితం కాకుండా గ్రామీణానికీ పాకింది. కేరళలో ప్రతి జిల్లాలో కనీసం 500 కేసులు నమోదయ్యాయి. అదే 2022లో మహారాష్ట్రలోని 80 శాతం కేసులు కేవలం ముంబయిలోనే, కర్ణాటకలోని 63 శాతం కేసులు బెంగళూరు నగరంలోనే రిపోర్ట్ అయ్యాయి. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 78 మందిపై ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కావడం గమనార్హం. అదే రెండోస్థానంలో ఉన్న పంజాబ్‌లో ఈ సంఖ్య 30కే పరిమితమవడం కేరళలో దాని తీవ్రతను వెల్లడిస్తున్నది. మిజోరంలోనూ ప్రతి లక్ష మందికి 25 కంటే ఎక్కువ మందిపై కేసులున్నాయి. 25 సంఖ్యకు మించిన కేసులు మరే రాష్ట్రంలోనూ లేకపోవడం గమనార్హం.
డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నదంటే?
అధికారుల కళ్లుగప్పి క్రిప్టోకరెన్సీతో ఈ మాదకద్రవ్యాలను విదేశాల నుంచి కొన్ని ముఠాలు సేకరిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ ద్వారా జర్మనీ, ఫ్రాన్స్, థాయ్‌లాండ్ సహా పలుదేశాల నుంచి డార్క్ వెబ్, కొరియర్ల సహకారంతో డ్రగ్స్ తీసుకువస్తున్నారు. సమీపంలోని బెంగళూరు, చెన్నైల నుంచి కేరళకు ఎక్కువగా ఎండీఎంఏ, మెథ్ వంటి డ్రగ్స్ వస్తున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా కేరళకున్న సుదీర్ఘ 590 కిలోమీటర్ల తీరప్రాంతాన్నీ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వినియోగిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో 2,387 కేసలు
తెలంగాణలోనూ ఎన్‌డీపీఎస్ఏ కింద కేసులు ప్రతియేటా పెరుగుతూ వస్తున్నాయి. 2022లో 1,281 కేసులుండగా, 2023లో 1,495 కేసులు, 2024లో అత్యధికంగా 2,387 కేసులు నమోదయ్యాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. టీఎస్‌న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గతేడాది నవంబర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి తీవ్రతను వెల్లడించారు. భారత్‌లో 8.5 లక్షల మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటుండగా.. అందులో తెలంగాణలోనే 64 వేల మంది ఉన్నారని, ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది గాంజా, ఓపియడ్స, సెడేటివ్స్, ఇన్‌హేలెంట్స్ వంటి డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఈ మహమ్మారిని 50 శాతం తగ్గించాలన్నా ఐదేళ్ల పోరాటం అవసరమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోరాటంలో ప్రజల సహకారమూ అవసరమని నొక్కిచెప్పారు.






