భారీ వర్షాలు.. రాష్ట్రంలో హై అలర్ట్.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

కేరళ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains in Kerala) కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.

భారీ వర్షాలు.. రాష్ట్రంలో హై అలర్ట్.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains in Kerala) కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. నదులనీటి మట్టాలు పెరగడంతో పాటు, పలు ప్రాంతాల్లో డ్యామ్‌లు కూడా తెరిచారు. వరదల ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్రం అంతటా హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, రెస్క్యూ బలగాలు మోహరించారు.

ఇప్పటివరకు వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. త్రిస్సూర్‌లోని కొడకరాలో ఓ భవనం కూలి ముగ్గురు, మలప్పురం, మంజెరి, తిరువనంతపురంలో ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి వెల్లనాడ్ వద్ద మిస్సైన సంఘటనలో ఆయన మృతదేహం కరమణ నదిలో వెలికి తీశారు.

ఇడుక్కిలోని లోయర్ పెరియార్, కల్లర్కుట్టి, పొన్ముడి, మలంకర డ్యామ్‌ల గేట్లు ఎత్తడంతో ముత్తిరపుఝయార్, తొడుపుఝ–మువట్టుపుఝ, కలియార్ నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. పలు ప్రార్థనా స్థలాల్లోకి నీరు చొచ్చుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయనాడ్‌లో బాణాసుర సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. అర్ధరాత్రి తర్వాత గేట్లు ఎత్తవద్దని కలెక్టర్ ఆదేశించారు. ముల్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం 134.30 అడుగులకు చేరింది. ఇది కొనసాగితే గేట్లు తెరవొచ్చని తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.

భారత వాతావరణ సంస్థ (IMD) మరిన్ని వర్షాలు పడతాయని హెచ్చరించింది. జూన్ 27, 28, 29 తేదీలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టయం, పఠానం‌తిట్ట, త్రిస్సూర్, పలక్కాడ్, వయనాడ్ జిల్లాల్లో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే నిలంబూర్, కుట్టనాడ్, చెర్తలా, ఇరిట్టి తాలూకాల్లోనూ అన్ని రకాల విద్యాసంస్థలు మూసివేశారు. కాగా.. వయనాడ్‌లో రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, పలక్కాడ్‌లో ప్రొఫెషనల్ కాలేజీలు సెలవుల పరిధిలోకి రావు.

కేరళ తీరంలోని కుంఝతూర్ నుంచి కోట్టెకున్ను వరకు 3.3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉన్నందున మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలను నదులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు నివారించాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది.

Next Story