- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kafala: సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థ రద్దు.. లక్షల మంది కార్మికులకు బానిసత్వం నుంచి విముక్తి
లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసిన వివాదాస్పద కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: 70 ఏళ్లకు పైగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసిన వివాదాస్పద కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ లోనే దీనిని రద్దు చేస్తున్నట్టు తెలపగా తాజాగా ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. వలసదారుల సంక్షేమం, కార్మిక హక్కులను పాటించడంలో ఇది చారిత్రాత్మక అడుగుగా చెప్పొచ్చు. ఈ వ్యవస్థ రద్దుతో 13 మిలియన్లకు పైగా విదేశీ కార్మికులు ప్రయోజనం పొందనున్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియా నుంచి వచ్చిన వారే ఉండటం గమనార్హం. అయితే సౌదీ అరేబియా కఫాలాను రద్దు చేసినప్పటికీ అనేక గల్ఫ్ దేశాల్లో ఇది కొనసాగుతోంది.
కఫాలా వ్యవస్థ ఏమిటి?
కఫాలా అనే పదం కఫీల్ అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. దీనికి స్పాన్సర్ లేదా విదేశీ కార్మికుడి వసతి, పనికి బాధ్యత వహించే వ్యక్తి అని అర్థం. ఈ సిస్టమ్ ప్రకారం.. విదేశీ కార్మికులు యజమాని స్పాన్సర్ షిప్ కింద పని చేయడానికి మాత్రమే అనుమతించబడతారు. యజమానులు తమ ఉద్యోగులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. దీనిని ఒక రకమైన బానిసత్వంగా చెప్పొచ్చు ఎందుకంటే విదేశాల నుంచి సౌదీకి వెళ్లే కార్మికులు తమ స్పాన్సర్ పర్మిషన్ లేకుండా ఉద్యోగాలు మార్చలేరు. అలాగే దేశం విడిచి వెళ్లలేరు. చట్టపరమైన సాయం సైతం పొందలేరు. అంతేగాక తమ సమస్యలపై అధికారులకు సైతం నేరుగా ఫిర్యాదు చేయలేరు. కార్మికుడు ఏ పని చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, వేతనం, నివాస స్థలం సైతం స్పాన్సరే నిర్ణయిస్తాడు.1950లో దీనిని ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. అయితే మొదట్లో ఈ వ్యవస్థ బానే ఉన్నా కాల క్రమేణా ఇది దోపిడీకి ప్రతీకగా మారింది. యజమానులు తరచుగా పాస్‌పోర్ట్‌లను జప్తు చేయడం, వేతనాలు ఆలస్యం చేయడం, ప్రయాణాన్ని పరిమితం చేయడం వంటివి చేసేవారు. దీంతో మానవ హక్కుల సంఘాలు దీనిని తీవ్రంగా విమర్శించాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వం దీనిని రద్దు చేసింది.
వలస కార్మికులకు ఉపశమనం
ఈ వ్యవస్థ రద్దుతో వలస కార్మికులకు ఉపశమనం లభించినట్టు అయింది. ఇప్పుడు కార్మికులు స్పాన్సర్ ఆధారితంగా కాకుండా కాంట్రాక్ట్ ఆధారితంగా ఉపాధి పొందనున్నారు. తమ యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలను మార్చుకోవడం, దేశాన్ని వీడటం వంటివి జరుగుతాయి. కాగా, 2.6 మిలియన్లకు పైగా భారతీయులు సౌదీ అరేబియాలో ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ పౌరుల హక్కులు రక్షించబడుతున్నాయని, వివాదాలను మరింత న్యాయంగా పరిష్కరించేందుకు సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించింది.






