JPC: జనవరి 31న మరోసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ..!

by Shamantha N |

జమిలి ఎన్నికలపై('One Nation One Election' Bill) రూపొందిన రెండు బిల్లుల పరిశీలనకు 39 మంది ఎంపీలతో ఏర్పాటైన ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’ (JPC) మరోసారి సమావేశం కానుంది.

JPC: జనవరి 31న మరోసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమిలి ఎన్నికలపై('One Nation One Election' Bill) రూపొందిన రెండు బిల్లుల పరిశీలనకు 39 మంది ఎంపీలతో ఏర్పాటైన ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’ (JPC) మరోసారి సమావేశం కానుంది. జనవరి 31న మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలోని ప్రధాన కమిటీ గదిలో సమావేశం జరగనుంది. జనవరి 8న నిర్వహించిన తొలి సమావేశంలో భిన్నస్వరాలు వినిపించాయి. ఒక దేశం ఒకే ఎన్నిక' బిల్లుపై మొదటి సమావేశం జనవరి 8న జరిగింది. ప్రతిపాదిత చట్టంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర చర్చ జరిగింది. న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ప్రతినిధులు కమిటీ ముందు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. బిల్లు చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ దాని ముసాయిదాను ప్రభావితం చేసిన 1950ల నుండి సంస్కరణలను హైలైట్ చేశారు. ఎన్నికల సంబంధిత ఖర్చులను తగ్గించడం, పాలన స్థిరత్వాన్ని నిర్ధారించడంపై ఈ ప్రదర్శన దృష్టి సారించింది. అయితే, ఈ బిల్లుని ఎన్డీయే కూటమి సభ్యులు ఈ విధానాన్ని సమర్థించగా విపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. జమిలి బిల్లు దేశానికి ప్రయోజనకరమని సమర్థించేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. బీజేపీ ఎంపీ, జేపీసీ ఛైర్మన్‌ పి.పి.చౌధరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో న్యాయశాఖ అధికారులు- చట్ట నిబంధనలను వివరించారు. వివిధ ప్రతిపాదనల్లోని హేతుబద్ధతను ఎంపీలు ప్రశ్నించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్యతత్వానికి జమిలి ఎన్నికలు విరుద్ధమని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయబోతున్నారని విపక్ష ఎంపీలు మండిపడ్డారు. ఒకేసారి ఎన్నికలన్నీ నిర్వహించడం వల్ల వ్యయం తగ్గిందని చెప్పడానికి ఏమైనా నిర్దిష్ట అంచనాలున్నాయా అని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ సహా పలువురు సభ్యులు ప్రశ్నించారు.

Next Story