ఖర్గేకు జేపీ నడ్డా క్షమాపణలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీజేపీ నేత జేపీ నడ్డా క్షమాపణలు తెలిపారు.

ఖర్గేకు జేపీ నడ్డా క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీజేపీ నేత జేపీ నడ్డా క్షమాపణలు తెలిపారు. అయితే నేడు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై వాడీవేడీ చర్చ జరిగింది. సభలో మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ.. రూల్ 267 కింద నోటీసు ఇచ్చి, పహల్గామ్ ఉగ్రవాద దాడులకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఖర్గే తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ.. బీజేపీని "గద్దార్" (దేశద్రోహులు) అని పిలిచారు.

ఈ వ్యాఖ్యలను సభలో నడ్డా తీవ్రంగా ఖండించారు. ఖర్గే 'మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి' (lost mental balance) ప్రధానమంత్రిపై అనుచిత పదజాలం ఉపయోగించారని వ్యాఖ్యానించారు. 'ఖర్గే గారు సీనియర్ నాయకుడు, కానీ ఆయన ప్రధానమంత్రిపై ఉపయోగించిన పదాలు ఆయన స్థాయికి తగనివి. గత 11 ఏళ్లుగా మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉన్నారు. ఇది ఖర్గే మానసిక సమతుల్యత కోల్పోయేలా చేసింది.' అని వ్యాఖ్యానించారు. నడ్డా ఉపయోగించిన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవడం అనే పాదంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి.

నడ్డా వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఇది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. విపక్షాల తీవ్ర ఒత్తిడి వల్ల నడ్డా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పారు. 'మేము విపక్ష నాయకుడిని గౌరవిస్తాము. నా పదాలను నేను ఉపసంహరించుకుంటున్నాను. మీ మనసు గాయపడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను. అయితే, మీరు కూడా భావోద్వేగంతో కొట్టుకుపోయారు, సభను అగౌరవ పరిచేలా మాట్లాడారు.' అని నడ్డా పేర్కొన్నారు.

Next Story