మహిళలకు 48 శాతం మేర పెరిగిన ఉద్యోగ అవకాశాలు

by Ajay Maddhiboyina |

భారతీయ ఉద్యోగ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా అధిక వృద్ధి చెందుతున్న పరిశ్రమలు, సాంకేతిక ఆధారిత ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయని ఫౌండిట్ వైస్ ప్రెసిడెంట్ అనుపమ భీమ్‌రజ్కా పేర్కొన్నారు.

మహిళలకు 48 శాతం మేర పెరిగిన ఉద్యోగ అవకాశాలు
X

- 25 శాతం ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కే

- అనుభవం ఉన్న వారికి కూడా భారీగా అవకాశాలు

- ఫౌండిట్ నివేదికలో వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ జాబ్ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి కనపడుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. నిరుటితో పోలిస్తే 2025లో 48 శాతం మేర అవకాశాలు పెరినట్లు ఫౌండిట్ సంస్థ సోమవారం వెల్లడించిన నివేదికలో స్పష్టమైంది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్స్యూరెన్స్, తయారీ, హెల్త్ కేర్ వంటి కీలక రంగాల్లో డిమాండ్ పెరిగింది. దీంతో పాటు కొత్త టెక్నాలజీల్లో ప్రత్యేక ప్రతిభ ఉన్న వారికి కూడా అవకాశాలు మెరుగుపడ్డాయి. 2025లో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో 25 శాతం ఫ్రెషర్స్‌కే కేటాయిస్తున్నారు. తమ కెరీర్‌లో తొలి దశలో ఉన్న వారికి ఐటీ, హెచ్ఆర్, మార్కెటింగ్ వంటి రంగాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక 0-3 ఏళ్ల అనుభవం ఉన్న వారికి 53 శాతం, 4-6 ఏళ్ల అనుభవం ఉన్న వారికి 32 శాతం మేర అవకాశాలు పెరిగాయి. ఇక రిక్రూట్‌మెంట్, స్టాఫింగ్, ఆర్‌పీఓ, బీఎఫ్ఎస్ఐ, అడ్వర్టైజింగ్, పీఆర్, ఈవెంట్స్ వంటి రంగాల్లో కూడా మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి.

భారతీయ ఉద్యోగ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా అధిక వృద్ధి చెందుతున్న పరిశ్రమలు, సాంకేతిక ఆధారిత ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయని ఫౌండిట్ వైస్ ప్రెసిడెంట్ అనుపమ భీమ్‌రజ్కా పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉద్యోగాలు కూడా 55 శాతం వృద్ధి చెందాయని, యాజమాన్యం ప్రాధాన్యతల మేరకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. మహిళలకు వచ్చే ఉద్యోగాల్లో 81 శాతం రూ.10 లక్షల లోపువే ఉన్నాయి. ఇక రూ.11 లక్షల నుంచి రూ.25 లక్షల ప్యాకేజీలో 11 శాతం.. రూ.25 లక్షలకు మించిన ప్యాకేజీలో 8 శాతం మంది మహిళలకు ఉగ్యోగాలు వస్తున్నాయని అన్నారు. దేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో మహిళలు 44 శాతం మేర భర్తీ అవుతున్నారని ఆమె తెలిపారు.

Next Story