Jharkhand election: రేపే జార్ఖండ్ తొలి పోరు.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే?

by B.Srinivas |

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోరుకు సర్వం సిద్ధమైంది.15 జిల్లాల్లోని 43 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది.

Jharkhand election: రేపే జార్ఖండ్ తొలి పోరు.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే?
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) తొలి విడత పోరుకు సర్వం సిద్ధమైంది.15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ (Poling) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో నిలవగా..అందులో 73 మంది మహిళా క్యాండిడేట్స్, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. రాష్ట్రంలో 2.6కోట్ల మంది ఓటర్లు ఉండగా తొలి దశలో 1,36,85,508 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 68,65,207 మంది పురుషులు, 68,20,000 మంది మహిళలు ఉన్నారు. ఇందుకు గాను ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తంగా15,344 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 12,716, పట్టణ ప్రాంతాల్లో 2,628 ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను మోహరించారు.

చంపయీ సోరెన్ భవితవ్యం తేలేది ఈ దశలోనే

మొదటి దశలో పలువురు ప్రముఖ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ సీఎం, బీజేపీ నేత చంపయీ సోరెన్ (Champai soren) సెరైకెలా సెగ్మెంట్ నుంచి బరిలో ఉండగా, ఆయన కుమారుడు బాబులాల్ సోరెన్ (Babulal Soren) ఘట్ శిల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ పోటీ చేసే స్థానాల్లో తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఇక, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా, మధు కోడా భార్య గీతా కోడా, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహులు ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు. దీంతో ఆయా స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేగాక జంషెడ్‌పూర్ వెస్ట్‌లో 2019లో అప్పటి సీఎం రఘుబర్ దాస్‌ను ఓడించి జేడీయూ నేత సరయూ రాయ్‌పై ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీలో ఉన్నారు.

‘ఇండియా’, ఎన్‌డీయే మధ్యే పోటీ!

జార్ఖండ్‌లో ఎన్నికల్లో ప్రధాన పోటీ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే (NDA) మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి దశలో మొత్తం 43 స్థానాల్లో జేఎంఎం 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) ఐదు స్థానాల్లో క్యాండిడేట్స్‌ను నిలిపింది. అలాగే బీజేపీ 36, తమ భాగస్వామ్య పార్టీ అయిన ఏజేఎస్‌యూ 4, జనతాదళ్ యునైటెట్ (Jdu) 2, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్ జేపీ(ఆర్) ఒక స్థానంలో బరిలో నిలిచాయి. ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలు సైతం బరిలో ఉన్నప్పటికీ ఇండియా, ఎన్ డీయే మధ్యే పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది.

Next Story