- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయ జయహో జగన్నాథ..! పూరీలో అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర
ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి పర్వదినాన ఇవాళ ఒడిశా (Odisha)లోని పూరీ (Puri)లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర (Rath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి పర్వదినాన ఇవాళ ఒడిశా (Odisha)లోని పూరీ (Puri)లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర (Rath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభమైంది. సుందర రథంపై మహిమాన్విత జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవితో కలిసి ఊరేగింపుగా గుండిచా ఆలయంవైపు వెళ్తున్నాడు.పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమై హిందూ రథోత్సవాలలో ఒకటి. ఈ రథయాత్రను శ్రీ కృష్ణుడి అవతారంగా ప్రజలు భావిస్తారు, భక్తి, సంస్కృతి, సామరస్యం యొక్క చిహ్నంగా జగన్నాథుడి రథయాత్రి నిలుస్తుంది. ఇందులో పాల్గొనడం ద్వారా భక్తులకు అన్ని తీర్థయాత్రల ఫలితాలు, పుణ్యం, మోక్షం లభిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు. రథం తాడును తాకడం లేదా లాగడం వల్ల చేసిన పాపల నుంచి విముక్తితో పాటు జగన్నాథుని ఆశీస్సులు లభిస్తాయని ప్రతీతి.
నేత్రోత్సవం, నవయవ్వన దర్శనం
ఇవాళ సరిగ్గా ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన రథయాత్రి 9 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర గుండిచా ఆలయంలో 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం బహుదా యాత్ర (Bahuda Yathra) ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. రథయాత్రకు ముందు, జ్యేష్ఠ పూర్ణిమ అయిన జూన్ 10న జగన్నాథుడికి సహస్రనామ పూజ జరిగింది. ఈ సమయంలో దేవతలకు అధిక స్నానం చేయడం వల్ల వారు అస్వస్థతకు గురైనట్లు భావించి 15 రోజుల పాటు రహస్య మందిరంలో ఉంటారు. ఈ సమయంలో భక్తులకు దర్శనానికి అనుతించరు. రథయాత్రకు ముందు రోజు ‘నవయవ్వన దర్శనం’ జరుగుతుంది, ఇందులో దేవతల కళ్లకు రంగులు వేసే ‘నేత్రోత్సవం’ నిర్వహిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు, పూరీ గజపతి మహారాజు దివ్యసింగ్ దేవ్ రథాలను బంగారు చీపురుతో శుభ్రం చేసే సాంప్రదాయ ఆచారం ‘చేరా పహన్రా’ నిర్వహిస్తారు.
200 టన్నులు.. 45 అడుగుల ఎత్తు..
జగన్నాథ రథయాత్రకు ప్రతి ఏటా కొత్త రథాలు నిర్మించబడతాయి. రథాలు 200 టన్నుల కంటే ఎక్కువ బరువు, 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. రథ నిర్మాణం అక్షయ తృతీయ నాడు ప్రారంభమై, 58 రోజులలో పూర్తవుతుంది. ఈ రథాలు మొత్తం 5 రకాల ప్రత్యేక కలపతో తయారవుతాయి. ఇందులో జగన్నాథుడి రథం పేరు నందిఘోష (గరుడ ధ్వజం)గా పిలుస్తారు. అది 46 అడుగుల ఎత్తు, 16 చక్రాలు ఉండగా.. సారథిగా దారుక ఉంటాడు. ఇక బలభద్రుడి రథం పేరు తాళధ్వజం దానికి 14 చక్రాలు, సుభద్ర దేవి రథం పేరు దేవదళన (పద్మ ధ్వజం), 12 చక్రాలు ఉంటాయి. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం గల తాళ్లు ఉపయోగిస్తారు. ఈ తాళ్లను తాకడం ద్వారా భక్తులు పుణ్యం పొందుతారని నమ్ముతారు.
ఊరేగింపు మార్గం ఇలా..
రథాలు పూరీ జగన్నాథ ఆలయంలోని సింహద్వారం నుంచి బడా దండా (గ్రాండ్ రోడ్) మీదుగా 2.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకుంటాయి. ఈ యాత్రలో లక్షలాది భక్తులు రథాలను లాగుతూ, 'జై జగన్నాథ' నినాదాలతో వాతావరణాన్ని భక్తిమయంగా మారుస్తారు. గుండిచా ఆలయంలో దేవతలు 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, ఆ తర్వాత బహుదా యాత్ర ద్వారా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే ప్రాంతాల్లో 275 ఏఐ కెమెరాలు, డ్రోన్లు, 10 వేల మంది జవాన్లతో రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.






