మారుతీ సుజుకీకి ఐటీ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసులు

by Ramesh Naini |

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL)కు ఆదాయపు పన్ను శాఖ నుంచి భారీ నోటీసులు అందాయి.

మారుతీ సుజుకీకి ఐటీ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL)కు ఆదాయపు పన్ను శాఖ నుంచి భారీ నోటీసులు అందాయి. 2022-23 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల మేర పన్ను చెల్లించాలని కోరుతూ ఐటీ శాఖ ‘డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్‌’ను జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఐటీ శాఖ పంపిన ఈ నోటీసులపై తాము డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. కంపెనీ వెల్లడించిన ఆదాయానికి (Returned Income), ఐటీ శాఖ లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాల కారణంగా ఈ అదనపు పన్ను డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నోటీసుల వల్ల కంపెనీ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై లేదా కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఆర్థిక గణాంకాలు ఇవే..

గత క్యూ3 (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం, కంపెనీ ఇప్పటికే రూ.1,036 కోట్ల మొత్తాన్ని పన్ను ఖర్చుల కింద చూపింది. మూడవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం (PAT) రూ.3,794 కోట్లుగా నమోదైంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మారుతీ సుజుకీ 14,35,945 వాహనాలను విక్రయించి, వార్షిక ప్రాతిపదికన 3.9 శాతం వృద్ధిని సాధించింది. ఇందులో ముఖ్యంగా కాంపాక్ట్ కార్లు (5.97 లక్షలు), యుటిలిటీ వెహికల్స్ (5.41 లక్షలు) ప్రధాన పాత్ర పోషించాయి.

మార్కెట్లో దూసుకుపోతున్న షేరు..

భారీ పన్ను నోటీసులు అందినప్పటికీ, స్టాక్ మార్కెట్లో మారుతీ సుజుకీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర 1.82% పెరిగి రూ.12,986.00 వద్ద స్థిరపడింది. రాబోయే నాలుగో త్రైమాసికం (Q4) ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధి రాహుల్ భారతీ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ సగటున 7% వృద్ధిని సాధించే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి అంచనాకు వస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story