Israel: ఇజ్రాయెల్‌ ఎయిర్ పోర్టుపై క్షిపణి దాడి.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

by B.Srinivas |

హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. టెల్ అవీవ్‌లోని బెన్ గురి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఆదివారం క్షిపణిదాడికి పాల్పడ్డారు.

Israel: ఇజ్రాయెల్‌ ఎయిర్ పోర్టుపై క్షిపణి దాడి.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని బెన్ గురి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (Air port) పై ఆదివారం క్షిపణిదాడికి పాల్పడ్డారు. హౌతీ రెబల్స్ ప్రయోగించిన ఈ మిస్సైల్ విమానాశ్రయానికి సమీపంలోని రోడ్డుపై పడింది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్షిపణిని ఆపడంలో తమ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది. దాడికి బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ రెబల్స్ ప్రకటించారు. క్షిపణి దాడితో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు.

ఎయిరిండియా విమానం దారి మళ్లింపు

మిసైల్ దాడి జరగడంతో ఢిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు అబుదాబీకి మళ్లించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం AI139 టెల్ అవీవ్‌లో ల్యాండ్ కావడానికి దాదాపు గంట ముందు ఈ దాడి జరిగింది. దీంతో దారి మళ్లించినట్లు సమాచారం. విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విమానాన్ని అబుదాబీకి మళ్లించాలని నిర్ణయం తీసుకున్న సమయానికి ఈ విమానం జోర్డాన్ గగనతలంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. హౌతీ రెబల్స్ తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఒక దెబ్బకు రెట్టింపు చర్యలు ఉంటాయన్నారు. రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ.. తమపై దాడిచేసిన వారికి అంతకు ఏడు రెట్లు బలంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు.

Next Story