Israel: గాజాను ఆక్రమించనున్న ఇజ్రాయెల్.. సైనిక చర్యలకు కేబినెట్ ఆమోదం !

by B.Srinivas |

టెల్ అవీవ్‌లోని విమానాశ్రయంపై క్షిపణి దాడి తర్వాత హమాస్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది.

Israel: గాజాను ఆక్రమించనున్న ఇజ్రాయెల్.. సైనిక చర్యలకు కేబినెట్ ఆమోదం !
X

దిశ, నేషనల్ బ్యూరో: టెల్ అవీవ్‌లోని (Tel aviv) విమానాశ్రయంపై క్షిపణి దాడి తర్వాత హమాస్‌ (Hamas) పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. గాజాలో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసే ప్రణాళికను కేబినెట్ఆమోదించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్‌ను తీవ్రతరం చేయడంపై చర్చించినట్టు వెల్లడించారు. అంతేగాక గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని, మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్లాన్ కూడా ఇందులో ఉందని తెలుస్తోంది. గాజాలో సైనిక చర్య తీవ్రతరం చేసేందుకు పదివేల మంది రిజర్వ్ సైనికులను రంగంలోకి దింపుతున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ప్రకటించిన మరుసటిరోజే కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ఇజ్రాయెల్ లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ టూర్ కు ముందే సైనిక చర్యలను అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

సీజ్ ఫైర్ తర్వాత దాడులు ముమ్మరం

ఇజ్రాయెల్, ఉగ్రవాద సంస్థ హమాస్ ఎనిమిది వారాల పాటు అమెరికా మద్దతుతో జరిగిన కాల్పుల విరమణ మార్చిలో ఆగిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాలో తిరిగి దాడులు ప్రారంభించింది. అంతేగాక ఒప్పందం ముగిసిన తర్వాత, ఇజ్రాయెల్ గాజాకు సహాయాన్ని నిలిపివేసింది. ప్రతి రోజూ గాజాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు సైతం నిలిచిపోయాయి. దీంతో తాజాగా సైనిక చర్యలను ముమ్మరం చేయాలని డిసిషన్ తీసుకోవడంతో మరోసారి ఆందోళన నెలకొంది.

కాగా, 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 52, 000 మంది పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మండి గాయపడటంతో పాటు నిరాశ్రయులయ్యారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. వారిని రిలీజ్ చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతుండగా అందుకు హమాస్ ససేమిరా అంటోంది.

Next Story