- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IndiGo Flights: ‘ఇండిగో’కు చెక్ పెట్టబోయి.. దాని వ్యూహంలోనే DGCA చిక్కిందా..?
ఇండిగో పన్నిన వ్యూహంలో డీజీసీఏ చిక్కిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. FDTL నిబంధనలను పాటించకుండా ఉండేందుకే ఇండిగో సంక్షోభాన్ని సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ సంక్షోభం కొనసాగుతుంది. వందల ఫ్లైట్స్ రద్దు కావడంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. వారికి ఈ విమానయాన సంస్థ కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. మరోవైపు ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయింది. వెంటనే వారికి అన్ని వసతులు కల్పించాలని ఆదేశించింది. అయితే ఈ సంక్షోభం అనూహ్యంగా ఏర్పడింది కాదని, ఇండిగో కావాలనే సృష్టించిందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ విమానయాన సంస్థ ఫ్లైట్స్‌ను రద్దు చేసి సమస్యను జఠిలం చేసిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే ఇండిగో ఇలా వ్యూహత్మక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? అసలు ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడింది అనే దానిపై పైలట్స్ యూనియన్స్ పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం చేస్తున్నారు.
దేశీయ మార్కెట్‌లో ఇండిగోకు 60 శాతం వాటా
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. 2006లో సర్వేసులను ప్రారంభించిన ఇండిగో దేశీయ మార్కెట్‌లో 60 శాతం వాటాను కలిగి ఉంది. రోజుకు 2 వేలకు పైగా ఫ్లైట్స్‌ను రన్ చేసే ఇండిగో అత్యుత్తమ సమయపాలన పాటించే సంస్థగా పేరొందింది. కానీ గడిచిన నెల రోజుల్లో 65 శాతం విమానాలను ఆలస్యంగా నడిపినట్టు DGCA నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే 1230 ఫ్లైట్స్‌ను రద్దు చేసి సంక్షోభంలో పడిపోయింది. అయితే ఇది సంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఏర్పడిన సంక్షోభం కాదని, ఇండిగోనే DGCAపై ఒత్తిడి పెంచేందుకు ఈ రకంగా వ్యూహం పన్నినట్టు కేంద్రం అనుమానిస్తుంది. దీనికి గల కారణాలు DGCA విధించిన నిబంధనలే అని అభిప్రాయపడుతుంది. ఫైలట్లను శ్రమ దోపిడీ నుంచి విముక్తి చేయాలని ప్రయత్నించిన DGCAను తన దారికి తెచ్చుకునే ప్రయత్నమేనని తెలుస్తోంది.
DGCA కొత్త నిబంధనలు ఏంటి..?
పైలట్లకు అలసట తగ్గించడానికి విశ్రాంతి సమయాన్ని పెంచుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జులై1, నవంబర్ 1 తేదీల నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటిల్లో సిబ్బందికి వారంవారీ తప్పనిసరి విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ డ్యూటీ విండోను 00:00 నుంచి 06:00 గంటలకు పెంచారు. నైట్ ల్యాండింగ్‌లపై పరిమితిని విధిస్తూ ఒక్కో పైలట్ వారానికి కేవలం రెండు రాత్రుల ల్యాండింగ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక రాత్రి ఆపరేషన్లలో గరిష్టంగా 8 గంటల ఫ్లైయింగ్ సమయాన్ని మాత్రమే విధించారు. ఈ నిబంధనలు నవంబర్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తాయని తెలిసినా ఇండిగో మాత్రం అక్టోబర్ 26న శీతాకాల షెడ్యూల్‌ను ప్రకటించి, విమానాల సంఖ్యను పెంచింది. తాజాగా DGCA నిబంధనలు అమల్లోకి రావడంతో పెద్ద సంఖ్యలో పైలట్లు తప్పనిసరి విశ్రాంతికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పైలట్లకు డ్యూటీలు కేటాయించడం కష్టతరంగా మారడంతో సంక్షోభం నెలకొందని ఏవియేషన్ నిపుణులు, రెగ్యులేటర్లు పేర్కొంటున్నారు.
ఇండిగోపై FIP తీవ్ర ఆరోపణలు
ఇండిగో సంక్షోభంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సంక్షోభం యజమాన్యం తీసుకున్న అసంబద్ద నిర్ణయాలు, వైఫల్యాల వల్లే అని ఆరోపించింది. నవంబర్ ఫస్ట్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిసినా ఇండిగో కొత్త నియమకాలను చేసుకోలేదని తెలిపింది. ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా సంవత్సరాలుగా అతి తక్కువ సిబ్బందితో విమాన సర్వీసులను నడుస్తుందని, కొత్త విశ్రాంతి నిబంధనలు అమలు అవుతాయని దృష్టిలో ఉంచుకోకుండానే శీతాకాల షెడ్యూల్‌ను ప్రకటించిందని, ఇండిగో ఉద్యోగులను ఇతర సంస్థలు తీసుకోకుండా అడ్డుకోవడం (Non-poaching pacts), జీతాల పెంపును నిలిపివేయడం వంటి చర్యలు కూడా సంస్థ తీసుకుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ తీవ్రంగా ఆరోపించింది.
FDTL నిబంధనల సడలింపు కోసమే ఇండిగో ఎత్తుగడ..?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అమలులోకి తీసుకువచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల నుంచి సడలింపు పొందేందుకే ఇండిగో ఈ సంక్షోభాన్ని సృష్టించిందని ఏవియేషన్ నిపుణులతోపాటు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తుంది. FDTL నిబంధనలను జనవరి 2024లో అన్ని విమానయాన సంస్థలకు పరిచయం చేసినా, ఇండిగో ఇప్పటివరకు వాటిని అమలకు పూనుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇతర విమానయాన సంస్థలు మాత్రం ముందుగానే మేల్కోని ఈ ప్రభావం నుంచి బయటపడ్డాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ పేర్కొంది. ఎఫ్‌డీటీఎల్ నియమాలలో సడలింపులు పొందేందుకు ఇండిగో యాజమాన్యం ఈ రకమైన ఎత్తుగడ వేసి నిబంధనలు అమలును తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు భద్రతకు ప్రమాదం కలిగిస్తాయని పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిని వాడుకొని, వారి సమస్యలను పరిష్కరించుకుంటుందని ఆరోపిస్తున్నారు.
ఇక ఈ సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ సైతం దిగొచ్చింది. పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36గంటల నుంచి 48గంటలకు పెంచగా ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించనున్నట్లు ప్రకటించింది. ఈ మినహాయింపులు వచ్చే ఫిబ్రవరి 10వరకు అమల్లో ఉంటాయని, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విమానాల రద్దుతో సంక్షోభానికి కారణమైన ఇండిగోపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.






