ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అదృశ్యం.. ఆందోళనలో ప్రజలు

by Yella Dhawani Reddy |

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు సాధారణస్థితికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అదృశ్యం.. ఆందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Iran-Isreal) మధ్య ఉద్రిక్తతలు సాధారణస్థితికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కొనసాగుతోంది. అయితే, ఇరాన్‌ ప్రజల్లో ప్రస్తుతం మరో కొత్త ఆందోళన నెలకొంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) వారం రోజులుగా కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే, సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చాక కూడా ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం ఇరాన్ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది.

కాగా, ఇజ్రాయెల్ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ మీడియా ఖమేనీకి సంబంధించిన ఎలాంటి చిత్రాలు గానీ, దృశ్యాలు గానీ ప్రసారం చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వ మీడియా కూడా మౌనం వహించడంతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. అయితే, ఆయనకు అత్యంత సన్నిహితులైన అధికారులు మాత్రం ఖమేనీని ఒక రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని, హత్యాయత్నాల నుంచి రక్షణ పొందేందుకు ఆయన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

ఇరాన్‌ రాజకీయ వ్యవస్థలో ఖమేనీ కీలక కేంద్రబిందువుగా ఉండటంతో, ఆయన గైర్హాజరీ కారణంగా భవిష్యత్ నాయకత్వంపై కూడా చర్చలు తలెత్తుతున్నాయి. సాధారణంగా భద్రతా సిబ్బందులతో పాటు ప్రభుత్వ ప్రముఖుల సమావేశాల్లో తరచుగా కనిపించే ఖమేనీ, ఇటీవల ఏ కార్యక్రమానికీ హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఖమేనీ ఎక్కడ ఉన్నారనే విషయంపై ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా స్పందించకపోవడం ప్రజల్లో భయం, ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ బహిరంగంగా ప్రత్యక్షమవుతారా? లేదా అధికారిక ప్రకటన వస్తుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story