యూఎస్ దాడుల తర్వాత.. ఇరాన్ టార్గెట్ చేసే మిలిటరీ బేస్‌లు ఇవే..!

by Phanindra |   (  Updated:2025-06-22 16:53:24  IST  )

ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ స్థావరాలపై యూఎస్ దాడులు చేసింది. దీంతో మధ్య ప్రాచ్యంలోని యూఎస్ మిలిటరీ బేస్‌లను ఇరాన్ టార్గెట్ చేయనుంది.

యూఎస్ దాడుల తర్వాత.. ఇరాన్ టార్గెట్ చేసే మిలిటరీ బేస్‌లు ఇవే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూక్లియర్ స్థావరాలపై యూఎస్ దాడులు చేయడంతో అమెరికాను టార్గెట్ చేస్తామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించింది. అయితే నేరుగా యూఎస్‌పై దాడులు చేయడం ఇరాన్‌కు కష్టమైన పని. కాబట్టి తమకు సమీపంలోని అమెరికా మిలిటరీ స్థావరాలను ఈ దేశం టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్‌ నుంచి షార్ట్ మిసైల్స్, డ్రోన్స్‌తో దాడులు చేసేందుకు వీలుగా సుమారు 19 యూఎస్ మిలిటరీ స్థావరాలున్నాయి. వీటిలో బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ చాలా కీలకమైనది. ఇదికాక, ఇరాన్ టార్గెట్ చేయగలిగే యూఎస్ మిలిటరీ స్థావరాలేవి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అని చూద్దాం.

  • బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఫిఫ్త్ ఫ్లీట్: ఈ ప్రాంతంలోని యూఎస్ బేస్‌లలోనే అత్యంత కీలకమైనది. పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం, ఎర్రసముద్రం, హిందూ మహాసముద్రంలో కొంత ప్రాంతం వరకు యూఎస్ నేవీ ఆపరేషన్లకు ఇదే కేంద్ర బిందువు. యూఎస్ నావల్ సెంట్రల్ కమాండ్‌ కూడా ఇక్కడ ఉంది. సముద్రంలో ఉండే 15 వేల మంది నేవీ ఆఫీసర్లతోపాటు బేస్‌లో వెయ్యి మందికిపైగా స్టాఫ్‌కు ఈ బేస్ సహకారం అందిస్తుంది. యూఎస్‌కు చెందిన భారీ యుద్ధనౌకలు, లాజిస్టిక్స్ నౌకలు, యాంటీ-మైన్ క్రాఫ్ట్‌లు, యూఎస్ కోస్ట్ గార్డ్ డిటాచ్‌మెంట్స్‌ కూడా ఇక్కడ అనేకం ఉంటాయి. బ్రిటిష్ రాయల్ నేవీ నిర్మించిన ఈ బేస్.. 1920ల వరకు వారి ఆధీనంలోనే ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూఎస్ చేతుల్లోకి వెళ్లింది. యూఎస్‌కు ఎంతో కీలకమైన ఈ బేస్‌ను ఇరాన్ కచ్చితంగా టార్గెట్ చేస్తుందని నిపుణుల అభిప్రాయం.
  • ఖతార్‌లోని ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్: మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద యూఎస్ మిలిటరీ స్థావరం ఇదే. యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ సదుపాయాలతోపాటు 379వ ఎయిర్ ఎక్స్‌పెడిషనరీ వింగ్‌, రొటేటింగ్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ దళాలు, స్పెషల్ ఫోర్స్ దళాలకు ఇది కేంద్రంగా వ్యవహరిస్తుంది.
  • కువైట్‌లోని అలీ అల్ సాలెం ఎయిర్‌బేస్: కువైట్‌లో పలు యూఎస్ మిలిటరీ బేస్‌లు ఉన్నప్పటికీ అలీ అల్ సాలెం ఎయిర్‌బేస్ చాలా కీలకమైంది. ఇరాక్ బోర్డర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బేస్‌లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 386వ ఎయిర్ ఎక్స్‌పెడిషనరీ వింగ్ ఉంటుంది. యూఎస్, దాని మిత్రదేశాల కోసం సైనికులను తరలించడంలో ఈ బేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడే యూఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్‌కు చెందిన ఫార్వర్డ్ హెడ్‌క్వార్టర్స్ క్యాంప్ ఆరిఫ్‌జాన్ కూడా ఉండటం గమనార్హం.
  • యూఏఈలోని ఆల్ ధాఫ్రా ఎయిర్‌బేస్: ఇక్కడ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 380వ ఎయిర్ ఎక్స్‌పెడిషనరీ వింగ్ ఉంటుంది. ఎఫ్-22 రాప్టర్ ఫైటర్ జెట్లతోపాటు ఎంక్యూ-9 రీపర్స్ వంటి కీలకమైన సర్వయిలెన్స్ డ్రోన్లు, ప్లేన్లు ఈ బేస్‌లో ఉంటాయి. దీనికితోడు కీలకమైన ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థ ‘గల్ఫ్ ఎయిర్ వార్‌ఫేర్ సెంటర్’ కూడా ఇక్కడే ఉంది.
  • ఇరాక్‌లోని ఆల్-హరీర్, ఆల్-అసద్ ఎయిర్‌బేస్‌లు: మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌కు బద్దశత్రువు ఇరాక్. ఈ దేశం 2003 యుద్ధం నుంచి యూఎస్‌కు చాలా కీలకమైన మిత్రదేశంగా ఉంది. ఈ దేశంలో సుమారు 2,500 మంది యూఎస్ సైనికులు ఉంటున్నారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చిన వారే. 2020లో ఇరాన్ కీలక నేత, ఖుద్స్ ఫోర్స్ లీడర్ ఖాసిం సొలేమానీని చంపినప్పుడు ఇరాక్‌లోని ఆల్ అసద్ ఎయిర్‌బేస్‌ను ఇరాన్ నేరుగా టార్గెట్ చేసింది. ఆల్ హరీర్ బేస్‌పై ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు దాడులు చేశాయి. కాబట్టి ఈసారి కూడా ఈ రెండు యూఎస్ బేస్‌లను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
  • జోర్డాన్‌లోని మువాఫక్ సాల్టీ ఎయిర్‌బేస్: 2018లో అప్‌గ్రేడ్ చేసిన ఈ బేస్‌ను జర్మనీ, డచ్‌తో యూఎస్ పంచుకుంటోంది. దీన్ని కూడా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  • సిరియాలోని పలు బేస్‌లు: ఐఎస్‌ను ఎదుర్కోవడం కోసం చాలా ఏళ్ల నుంచి సిరియాలోని పలు ప్రాంతాల్లో యూఎస్ మిలిటరీ బేస్‌లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ దక్షిణ సిరియాలో ఇరాక్, జోర్డాన్ సరిహద్దులకు దగ్గర్లో యూఎస్‌కు చెందిన ఆల్ తాన్ఫ్ గారిసన్ ఉంది. దీనిపై కూడా ఇరాన్, లేదా దాని ప్రాక్సీ గ్రూపులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది.

ఇవికాక ఇంకా అనేక యూఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయడానికి ఛాన్సులున్నాయి. యెమెన్, ఇరాక్, లెబనాన్ దేశాల్లో ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు అనేకం ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా దళాలు భారీగా నష్టపోయినా.. హౌతీలు ఇంకా బలంగానే ఉన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో యూఎస్ తలదూరిస్తే ఎర్రసముద్రంలో దాడులు మొదలుపెడతామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఇప్పుడు వీరితో ఇరాన్ దాడులు చేయించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తమకు కలిగే నష్టం కన్నా యూఎస్‌కు ఎన్నో రెట్లు నష్టం కలిగిస్తామని హెచ్చరించిన ఇరాన్.. మధ్య ప్రాచ్యంలోని యూఎస్ బేస్‌లను టార్గెట్ చేయడం ఖాయమని నిపుణుల అభిప్రాయం.

Next Story