అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-04 05:18:03  IST  )

అణు ఒప్పందంపై (Nuclear deal) అమెరికాతో (America) తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్ (Iran) సుముఖత ప్రకటించినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను విధించింది.

అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌
X

దిశ, వెబ్ డెస్క్: అణు ఒప్పందంపై (Nuclear deal) అమెరికాతో (America) తిరిగి చర్చలు జరిపేందుకు ఇరాన్ (Iran) సుముఖత ప్రకటించినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను విధించింది. గతంలో 2015లో కుదిరిన అణు ఒప్పందం (JCPOA) నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్నందుకు ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మళ్లీ అలాంటి మోసపూరిత చర్యలు జరగకుండా ఉండేందుకు అమెరికా నుంచి స్పష్టమైన, నమ్మదగిన బహిరంగ హామీ రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్‌ ఎలాహి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ నుంచి కూడా భవిష్యత్‌లో ఎలాంటి దురాక్రమణలు, సైబర్ దాడులు, లేదా గూఢచర్య చర్యలు జరగకూడదని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ చేపట్టిన కొన్ని రహస్య ఆపరేషన్లు, సైనిక చర్యలపై గాఢమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో అనేకమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సైనిక అధికారులతో పాటు సాధారణ ప్రజలను కోల్పోయామన్నారు. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చట్టాలను ఉల్లంఘించాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దురాక్రమణలు పునరావృతం కాకూడదని, ఆయుధ శక్తితో గానీ, సైబర్ దాడులతో గానీ తమ భద్రతకు విఘాతం కలిగించకూడదని హెచ్చరించారు.

దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తమ నమ్మకం ఉన్నప్పటికీ, అమెరికా మాటలను నమ్మేందుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని అభిప్రాయపడ్డారు. అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఆ దేశంతో చేతులు కలిపి దాడులకు పాల్పడిందన్నారు. ఇది దౌత్య ద్రోహమన్నారు. ఈ దాడులపై అమెరికా స్పందించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. చరిత్రలో ఎక్కడా కూడా ఇరాన్‌ ఏ దేశం పైనా దాడి చేయలేదని, గాజా విషయంలో కూడా తాము శాంతియుత వైఖరిని ప్రదర్శించామన్నారు. ఈసందర్భంగా దౌత్యానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, చర్చలు గౌరవభరితంగా, పరస్పర నమ్మకంతో జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Next Story