Iran: అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగే యోచనలో ఇరాన్

by S Gopi |

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనే ఉద్దేశం లేదు, కానీ అణుశక్తి, పరిశోధనపై హక్కులు కలిగి ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు

Iran: అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగే యోచనలో ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు సోమవారం ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ పార్లమెంటు బిల్లును సిద్ధం చేస్తోందని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇప్పటికీ టెహ్రాన్ సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీని వ్యతిరేకిస్తుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనే ఉద్దేశం లేదు, కానీ అణుశక్తి, పరిశోధనపై హక్కులు కలిగి ఉండాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సామూహిక విధ్వంసక ఆయుధాలకు వ్యతిరేకంగా సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ శాసనాన్ని ప్రస్తావించారు.

అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) అనేది అణ్వాయుధాలు, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల వ్యాప్తిని నిరోధించడం. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంలో సహకారాన్ని ప్రోత్సహించడం, అణ్వాయుధాలు లేని లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పెట్టుకున్న అంతర్జాతీయ ఒప్పందం. 1950ల కాలంలో అప్పటి ఇరాన్ రాజు షా రెజా ఆధ్వర్యంలో అణు కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో దీనికోసం అమెరికా కూడా సాయం చేసింది. అనంతరం 1958లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో ఇరాన్ సభ్యత్వం కూడా తీసుకుంది. తర్వాత 1968లో ఇరాన్ ఎన్‌పీటీ ఒప్పందం చేసి, 1970లో ఆ ఒప్పందానికి చట్టసభలో ఆమోదం తీసుకుంది. ఈ సంతకం ద్వారా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేందుకు వెల్లేదు. అయితే, ప్రస్తుతం ఇరాన్ అణు కార్యక్రమం పేరున ఆయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో టెహ్రాన్ కావాల్సిన దానికంటే ఎక్కువ యురేనియంను శుద్ధి చేస్తున్నట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సైతం స్పష్టం చేసింది. ఈ కారణంతోనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్‌పై క్షిపణి దాడులకు దిగింది.

Next Story