భారత్‌ వస్తున్న ఇరాన్‌ చమురు నౌక చైనాకు మళ్లింపు.. స్పందించిన కేంద్రం

by Ramesh Naini |

భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడిచమురు నౌక గమ్యస్థానం మారి చైనాకు వెళ్లడానికి ‘చెల్లింపుల సమస్యలే’ కారణమంటూ వస్తున్న వార్తలను భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

భారత్‌ వస్తున్న ఇరాన్‌ చమురు నౌక చైనాకు మళ్లింపు.. స్పందించిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడిచమురు నౌక గమ్యస్థానం మారి చైనాకు వెళ్లడానికి ‘చెల్లింపుల సమస్యలే’ కారణమంటూ వస్తున్న వార్తలను భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమని స్పష్టం చేసింది. అసలేం జరిగింది? సుమారు 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడిచమురుతో భారత్‌లోని వడినార్‌ (గుజరాత్) కు బయల్దేరిన ‘పింగ్ షున్’ అనే ఆఫ్రామాక్స్ ట్యాంకర్, మార్గమధ్యలో చైనాలోని ‘డోంగ్యింగ్’ వైపు మళ్లినట్లు కెప్లర్ (Kpler) అనే షిప్ ట్రాకింగ్ సంస్థ గుర్తించింది. దీంతో చెల్లింపుల సమస్యల వల్లే ఇలా జరిగిందనే వదంతులు వ్యాపించాయి.

వార్తలపై స్పందించిన కేంద్రం

ఈ వార్తలపై స్పందించిన కేంద్రం.. అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో వ్యాపార ఆప్టిమైజేషన్, నిర్వహణ సౌలభ్యం కోసం నౌకలు మార్గమధ్యలో గమ్యస్థానాలను మార్చుకోవడం అత్యంత సహజమని తెలిపింది. ఇరాన్ చమురు దిగుమతులకు సంబంధించి భారత్‌కు ఎలాంటి చెల్లింపుల అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. 40కి పైగా దేశాల నుంచి చమురును కొనుగోలు చేసే సౌలభ్యం భారత ఆయిల్ కంపెనీలకు ఉందని, రాబోయే నెలలకు సరిపడా చమురు సరఫరాలను ఇప్పటికే సురక్షితంగా ఉంచుకున్నామని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది. 2019లో అమెరికా ఆంక్షల తర్వాత భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ధరలను నియంత్రించేందుకు అమెరికా మార్చి 20న 30 రోజుల పాటు ఈ ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది (ఏప్రిల్ 19 వరకు). ఈ సడలింపుల తర్వాత భారత్‌కు వస్తున్న ఇరాన్‌ నౌక మార్గమధ్యలో చైనాకు మళ్లడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.


Next Story