ISRO: వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు శుభాంశు శుక్లా

by S Gopi |

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, ఇస్రో పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.

ISRO: వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు శుభాంశు శుక్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యోమగామిని మోసుకెళ్లే అంతర్జాతీయ అంతరిక్ష యాత్ర వచ్చే నెలలో చేపట్టనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, ఇస్రో పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారని చెప్పారు. శుభాంశు శుక్లా చేయబోయే ఈ యాత్ర చాలా కీలకమైన ప్రయాణం. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నదని చెప్పేందుకు ఇదే ఆధారం. ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) సందర్శించిన మొట్టమొదటి భారతీయుడిగా రాకేశ్ శర్మ 1984లో సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారని, వచ్చే నెలలో జరిగే ఈ మిషన్‌ గుర్తుండిపోతుందని జితేంద్ర సింగ్ సమావేశంలో అన్నారు. ఇదే సమావేశంలో ఇస్రో భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష ప్రయోగాల గురించి సంస్థ ఛైర్మన్ వీ నారాయణన్ ప్రజంటేషన్ ఇచ్చారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మొదటి మానవసహిత అంతరిక్షయాంత్ర 'గగన్‌యాన్ ' కోసం ఇస్రో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఐఎస్ఎస్‌కు మన వ్యోమగామిని పంపిస్తారు. అమెరికాతో కలిసి చేపట్టబోయే ఈ మిషన్ కోసం గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లాను ఇస్రో ఎంపిక చేసింది. గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లాయే అతిపిన్న వయస్కుడు కావడం విశేషం.

Next Story