ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేయొద్దు: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్స్

by Naga Rani Yarlagadda |

దేశంలో పేరుగాంచిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఆరోగ్యం, పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతపై సీరియస్ గా దృష్టి సారించింది.

ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేయొద్దు: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పేరుగాంచిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఆరోగ్యం, పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతపై సీరియస్ గా దృష్టి సారించింది. ఉద్యోగులు నిర్ణీత పని గంటలు పూర్తయిన తర్వాత అదనపు పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని స్పష్టమైన సూచనలు ఇస్తోంది. ఈ మార్గదర్శకాలు, సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన “వారానికి 70 గంటల పని చేయాలి” అన్న వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.

ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం సుమారు 3.23 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023 నవంబర్ నుంచి సంస్థ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తోంది. నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకి హాజరుకావాల్సి ఉంటుంది. అయితే.. చాలామంది ఉద్యోగులు అధిక పని గంటలు, సరైన నిద్ర లేకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటి ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హెచ్‌ఆర్ విభాగం గుర్తించింది. గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ జాగ్రత్త చర్యల్ని ప్రారంభించింది. ఉద్యోగుల పని సమయాన్ని సంస్థ బాగా పర్యవేక్షిస్తోంది. వారానికి ఐదు రోజుల చొప్పున, రోజుకు సగటున 9.15 గంటల వరకు పని చేయాలని నిబంధన ఉంది. అయితే దానికి మించి పనిచేస్తున్నవారికి ప్రత్యేకంగా ఈ-మెయిల్స్ ద్వారా సూచనలు పంపిస్తోంది. వీటిలో పని అనంతరం విశ్రాంతి అవసరం. మధ్యలో బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి అని వివరిస్తోంది. అత్యవసర పరిస్థితులు తప్ప మరో పని చేయొద్దని స్పష్టం చేస్తోంది.

ఇటీవలి కాలంలో నారాయణమూర్తి ఉద్యోగుల పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు, వారానికి 70 గంటలపాటు యువత పనిచేయాలి అన్న అభిప్రాయం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఆయన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ అన్న భావనకు పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. ఐదు రోజుల పని విధానాన్ని కూడా విమర్శించారు. అయితే, ప్రస్తుత యాజమాన్యం ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడడానికే మొదట ప్రాధాన్యత ఇస్తుండటంతో నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.

Next Story