Operation Sindoor: పాక్ ఉగ్రవాదాన్ని వీడేదాకా సింధు ఒప్పందం నిలిపివేత: భారత్

by S Gopi |

ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు.

Operation Sindoor: పాక్ ఉగ్రవాదాన్ని వీడేదాకా సింధు ఒప్పందం నిలిపివేత: భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం 'ఖచ్చితంగా, పూర్తిస్థాయిలో' విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. భారత్‌లోని ప్రజలనే కాకుండా ఇతర దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. సద్భావన, స్నేహ భావంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. అయితే, పాకిస్తాన్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఒప్పందంలోని మూలసూత్రాలకు తూట్లు పొడిచింది. తాజాగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) నిర్ణయం ప్రకారం, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి వదులుకున్నట్టు నమ్మకం ఏర్పడే వరకూ సింధు జలాల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుంది జైశ్వాల్ వెల్లడించారు.

పీఓకే అంశం రెండు దేశాలదే

ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశానికి సంబంధించి ద్వైపాక్షిక చర్చలు మాత్రమే ఏకైక మార్గమని రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు. ద్వైపాక్షిక చర్చలే కానీ ఎలాంటి మధ్యవర్తిత్వానికి అంగీకరించేది లేదని, పీఓకేను పాకిస్తాన్ ఖాళీ చేయడం మాత్రమే మిగిలి ఉందన్నారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ వదిలేయడమే ఉత్తమ నిర్ణయమని జైశ్వాల్ అన్నారు. కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేది దీర్ఘకాల వైఖరి, అందులో ఎటువంటి మార్పు ఉండదని ఆయన పునరుద్ఘాటించారు.

కాల్పుల విరమణ కూడా ఇరు దేశాలకు చెందిన డీజీఎంవోల స్థాయిలోనే చర్చలు జరిగాయని జైశ్వాల్ మరోసారి ప్రస్తావించారు. ఆ వివరాలను కూడా ఇప్పటికే తెలియజేశాం. ఈ నెల 10న పాకిస్తాన్ హైకమిషన్ మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో భారత విదేశాంగ శాఖకు ఫోన్ చేసింది. అయితే, పాక్ హాట్‌లైన్‌లో సాంకేతిక సమస్య వల్ల తిరిగి 3.25 గంటలకు కనెక్ట్ అయిన తర్వాత చర్చలు జరిగాయి. కాల్పుల విరమణకు ఎవరు ముందుకొచ్చారనేది ప్రపంచానికి తెలుసని జశ్వాల్ స్పష్టం చేశారు.

వాణిజ్యం ఊసే లేదు

ఇదే సమయంలో వాణిజ్యం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన జైశ్వాల్.. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి మే 10న కాల్పుల విరమణ, సైనిక చర్యపై అవగాహన కుదిరే వరకు, భారత్, అమెరికా నేతల మధ్య ఆ పరిస్థితుల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఏ సందర్భంలోనూ వాణిజ్యం గురించి ప్రస్తావన జరగలేదని స్పష్టం చేశారు.

Next Story