సంక్షోభానికి ఒక కారణం అంటూ లేదు.. అప్పుడే ఏం చెప్పలేం: ఇండిగో

by Phanindra |

ఎయిర్ లైన్స్ సంక్షోభానికి ఒక కారణం అంటూ లేదని, అసలు కారణం ఏంటని అప్పుడే చెప్పలేమని ప్రభుత్వానికి ఇండిగో తెలిపింది.

సంక్షోభానికి ఒక కారణం అంటూ లేదు.. అప్పుడే ఏం చెప్పలేం: ఇండిగో
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం వేళ.. ఈ పరిస్థితికి కారణాలు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థ వివరణనిచ్చింది. డిసెంబరు 3 నుంచి ఈ సంస్థకు చెందిన 2 వేలపైగా విమానాలు రద్దవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. పరిస్థితిని చక్కదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఈ సంక్షోభానికి కారణాలు తెలుసుకునే పనికూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో నుంచి వివరణ కోరగా.. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు ఇండిగో తమ స్పందన తెలియజేస్తూ లేఖరాసింది. ఈ లేఖలో పరిస్థితికి క్షమాపణలు తెలిపిన ఇండిగో సంస్థ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. అదే క్రమంలో ఇలా జరగడానికి పలుకారణాలున్నాయని వివరించింది.

ఈ సంక్షోభానికి ఏదో ఒక విషయమే కారణమని చెప్పడం కష్టమన్న ఇండిగో.. పలు కారణాలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురై ఈ పరిస్థితికి దారితీసినట్లు వెల్లడించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం, షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం ఉంటుందని, తమకు కొంత సమయం ఇస్తే మరింత సమాచారం సేకరించి, అసలు కారణాన్ని కనుగొంటామని కోరింది. ప్రస్తుతానికైతే చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల చేయాల్సి వచ్చిన షెడ్యూల్ అడ్జస్ట్‌మెంట్లు, వాతావరణ పరిస్థితులు, విమానాల రద్దీ, ఎయిర్‌పోర్టు కార్యాచరణతోపాటు కొత్తగా తీసుకొచ్చిన ఫ్లయిట్ డ్యూటీ టైం పరిమితులు (ఎఫ్‌డీటీఎల్) వంటి కారణాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఎఫ్‌డీటీఎల్‌ను అమలు చేయడంలో ఉన్న సమస్యలను ఇదివరకే డీజీసీఏకు వెల్లడించామని, తాత్కాలికంగా మినహాయింపు కోరామని లేఖలో ఇండిగో గుర్తుచేసింది. ఈ కారణాల భారమంతా పడటంతోనే డిసెంబరులో సంస్థ ఆన్ టైం పెర్ఫామెన్స్ దెబ్బతిన్నట్లు వివరించింది.

ఇప్పటికే ఈ సంక్షోభానికి కారణాలు కనుగొనేందుకు డీజీసీఏ ఒక కమిటీ వేసింది. అలాగే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, మరికొందరు సీనియర్ అధికారులను ఆఫీసుకు పిలిచి వివరణ కోరింది. ఈ దర్యాప్తు ఫలితాలు మరో 15 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story