Indians: విదేశీ జైళ్లలో10,152 మంది భారతీయులు.. పార్లమెంటుకు తెలిపిన కేంద్రం

by B.Srinivas |

ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో మొత్తం10,152 మంది భారతీయులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది.

Indians: విదేశీ జైళ్లలో10,152 మంది భారతీయులు.. పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో మొత్తం10,152 మంది భారతీయులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం (Union government) గురువారం పార్లమెంటుకు తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ (Tmc) ఎంపీ సాకేత్ గోఖలే (Saketh gokale) అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirthi vardan singh) సమాధానమిచ్చారు. విదేశీ జైళ్లలో ప్రస్తుతం 10,152 మంది ఖైదీలు ఉండగా వారిలో అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,633 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2,518, నేపాల్‌లో 1317 మంది ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఖతార్ 611, కువైట్387, మలేషియా 338, యూకే 288, పాకిస్తాన్ 266, చైనా 173, యుఎస్‌లో 169 మంది ఉన్నట్టు తెలిపారు.

54 మంది భారతీయ పౌరులకు విదేశీ కోర్టులు మరణశిక్ష విధించాయని వెల్లడించారు. మరణశిక్షలో అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్న దేశాలు యూఏఈలో 29, సౌదీ అరేబియా 12 మంది ఉన్నారు. విదేశీ కోర్టుల నుంచి మరణశిక్షతో సహా శిక్ష పడిన భారతీయులకు భారత రాయబార కార్యాలయాలు అన్ని విధాలుగా సహాయం అందిస్తాయన్నారు. అలాగే ప్రస్తుతం ఇతర దేశాల్లో మొత్తం 307 మంది భారతీయ మత్స్యకారులు నిర్బంధించబడ్డారని, వీరిలో పాకిస్తాన్‌లో 217 మంది, శ్రీలంకలో 58 మంది, సౌదీ అరేబియాలో 28 మంది, బహ్రెయిన్‌లో నలుగురు ఉన్నారని తెలిపారు. 2024లో శ్రీలంక 479 మంది భారతీయ జాలర్లను విడుదల చేయగా, బంగ్లాదేశ్ 95 మందిని విడుదల చేసింది.

Next Story