- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుణాచల్ ప్రదేశ్ మాదంటూ.. చైనా ఎయిర్ పోర్టులో భారతీయ మహిళకు వేధింపులు!
అరుణాచల్ ప్రదేశ్ మాదంటూ.. చైనా ఎయిర్ పోర్టులో భారతీయ మహిళను అధికారులు వేధించారు. ఆమె పాస్‌పోర్టు చెల్లదని బెదిరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: లండన్‌కు చెందిన ఒక భారత సంతతి మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రేమ వాంగ్జమ్ థోంగ్‌డక్ అనే యవతి యూకేలో ఉంటోంది. అక్కడి నుంచి జపాన్ వెళ్లేందుకు బయల్దేరిన ఆమె విమానం.. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో ట్రాన్సిట్ కోసం ఆగింది. అక్కడ విమానం మారేందుకు ఆమె మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో షాంఘై విమానాశ్రయంలోని అధికారులు ఆమె పాస్‌పోర్టు చెల్లదంటూ గొడవ చేశారని ప్రేమ వెల్లడించారు. గతంలో తను షాంఘై నుంచి ఎలాంటి సమస్య లేకుండా వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన ప్రేమ.. సమస్య ఏంటని వారిని అడిగింది.
ఆమె పాస్‌పోర్టులో పుట్టిన స్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటాన్ని చూపించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు.. ‘అరునాచల్ చైనాలో భాగం. నీ పాస్‌పోర్ట్ చెల్లదు’ అని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. చాలామంది ఇమిగ్రేషన్ అధికారులు, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది కూడా తనను ఎగతాళి చేశారని, చైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటూ సలహాలిచ్చారని ఆమె చెప్పారు. ఆ తర్వాత యూకేలోని తన స్నేహితుల సహకారంతో భారత ఎంబసీని చేరుకోగలిగానని, వారి చొరవతో జపాన్ చేరుకోగలిగానని తెలియజేశారు.
తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఆమె.. ఈ విషయంలో చైనాను భారత్ నిలదీయాలని, ఇది భారత సార్వభౌమాధికారాన్ని నేరుగా ప్రశ్నించడమేనని, అరుణాచల్ ప్రజలను అవమానించడమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అవమానించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని, నష్టపరిహారం చెల్లించేలా ఒత్తిడి చేయాలని కోరారు. అలాగే ఇకపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ఇలాంటి సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.






