All-time Low: మునుపెన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం

by Gantepaka Srikanth |

భారతీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది.

All-time Low: మునుపెన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి (All-time Low) పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే భారీగా క్షీణించి, ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూ.94.82 వద్దకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా డాలర్‌తో పోలిస్తే 93-94 మధ్య ఊగిసలాడుతున్న రూపాయి, నేడు ఒక్కసారిగా 86 పైసల మేర పతనమై 94.82 స్థాయిని తాకింది. ఈ ఏడాది (2026) ప్రారంభం నుండి రూపాయి సుమారు 5 శాతం మేర క్షీణించడం గమనార్హం.

పతనానికి కారణాలు..

ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయం మార్కెట్లను వెంటాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటడం భారత్ లాంటి దిగుమతి దేశాల కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. చమురు ధరలు పెరగడంతో మన దేశ దిగుమతి వ్యయం భారీగా పెరిగి, కరెన్సీ నిల్వలపై ప్రభావం చూపుతోంది. భారత స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి బలహీనపడటానికి కారణమైంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ముడిచమురు, వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉంది.

Next Story