- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Canadian PM Race: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య
భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య కెనడా ప్రధాని బరిలో నిలిచారు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య ప్రధాని ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య కెనడా ప్రధాని బరిలో నిలిచారు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య ప్రధాని ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. పదవి రేసులో తాను ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని కన్నడలో ప్రకటించడం గమనార్హం. ‘‘భావి తరాల భవిష్యత్ కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చంద్ర ఆర్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. దానికోసం నా దగ్గర చాలా పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని రాసుకొచ్చారు.
కర్ణాటక మూలాలు
కర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీని ప్రారంభించారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామికవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించి.. అందరి దృష్టిన ఆకర్షించారు. కాగా.. ఇటీవలే కెనడాలో రాజకీయసంక్షోభం ఏర్పడింది. రాజకీయ పరిణామాలతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే కెనడా ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ప్రకటించారు. మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది.






