- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై తీరంలో భారీ ఆపరేషన్ : అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
అరేబియా సముద్రంలో సాగుతున్న భారీ అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది శనివారం భగ్నం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అరేబియా సముద్రంలో సాగుతున్న భారీ అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రాకెట్‌ను భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది శనివారం భగ్నం చేశారు. ముంబై తీరానికి పశ్చిమ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో మధ్య సముద్రంలో సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నౌకలను అదుపులోకి తీసుకుంది.
కోస్ట్ గార్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధ వాతావరణం నెలకొన్న దేశాల నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసి, వాటిని అంతర్జాతీయ జలాల్లోని ఇతర మోటార్ ట్యాంకర్లకు మధ్య సముద్రంలోనే (Mid-sea transfer) బదిలీ చేయడం ఈ ముఠా ప్రధాన పని. దీని ద్వారా భారీ లాభాలను ఆర్జించడమే కాకుండా, తీరప్రాంత దేశాలకు చెల్లించాల్సిన సుంకాలను ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో భారత కోస్ట్ గార్డ్ అత్యాధునిక 'టెక్-ఇంక్లూజివ్' (Tech Inclusive) నిఘా వ్యవస్థను వినియోగించింది. భారత ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లో ఒక మోటార్ ట్యాంకర్ అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన అధికారులు.. డిజిటల్ డేటా అనాలిసిస్ ద్వారా దానితో సంబంధం ఉన్న మరో రెండు నౌకలను గుర్తించారు.
ఫిబ్రవరి 5న కోస్ట్ గార్డ్ ప్రత్యేక బృందాలు ఈ నౌకలను చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. నౌకల్లోని ఎలక్ట్రానిక్ డేటా, పత్రాలను పరిశీలించి, సిబ్బందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చట్టాల నుండి తప్పించుకోవడానికి ఈ నౌకలు తరచుగా తమ గుర్తింపును మార్చుకుంటున్నాయని కోస్ట్ గార్డ్ సిబ్బంది వెల్లడించారు. ఈ ముఠా వెనుక వివిధ దేశాలకు చెందిన హ్యాండ్లర్లు, యజమానులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ నౌకలను తదుపరి విచారణ నిమిత్తం ముంబై తీరానికి తరలించనున్నారు. అనంతరం వీరిని కస్టమ్స్ శాఖకు, ఇతర చట్ట అమలు సంస్థలకు అప్పగించనున్నట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ ద్వారా సముద్ర భద్రత విషయంలో భారత్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది.






