భారత్ ఎవరికీ తలవంచదు.. యూఎస్ సుంకాలకు పియూష్ గోయల్ కౌంటర్

by Phanindra |

యూఎస్ సుంకాలపై పియూష్ గోయల్ స్పందించారు. భారత్ ఎవరికీ తలవంచదని స్పష్టంచేశారు.

భారత్ ఎవరికీ తలవంచదు.. యూఎస్ సుంకాలకు పియూష్ గోయల్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అదనపు సుంకాల నేపథ్యంలో భారత్‌ ఎవరికీ తలవంచదని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ తేల్చిచెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్య సమస్యల నేపథ్యంలో భారత్ మరింత బలంగా, స్వాభిమానంతో ఉందని, 6.5 శాతం ఎదుగుదలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ప్రపంచం ‘డీగ్లోబలైజేషన్’ దిశగా వెళ్తోందనే వాదనతో గోయల్ విభేదించారు. తమ భాగస్వాములను, వాణిజ్య మార్గాలను పునర్నిర్మించుకుంటున్నాయని అన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాదే భారత్ ఎక్కువ ఎగుమతులు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వాణిజ్య ఆంక్షలను కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో కేవలం ఎక్సయిజ్ డ్యూటీలో కోతలు మాత్రమే భారత్ అడిగేదని, ఆ స్థాయి నుంచి చాలా ఎదిగామని చెప్పారు.

నాలుగు దేశాల ఈఎఫ్‌టీఏ కూటమితో వాణిజ్య ఒప్పందాల సమయంలో తన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. ‘మాది 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్నాం. మా వద్ద యువశక్తి ఉంది. కానీ మీది వయసు మీద పడుతున్న జనాభా అని వాళ్లకు చెప్పా’ అని గోయల్ చెప్పారు. ఈఎఫ్‌టీఏ దేశాలు భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయని, ఈ ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమలవుతుందని తెలియజేశారు. దీంతో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో సహా మొత్తం 50 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. ఈ ఫలితాలు అందరికీ కనిపిస్తాయని హామీ ఇచ్చారు.

భారత్‌ను ‘డెడ్ ఎకానమీ’ అన్న ట్రంప్ వ్యాఖ్యలను కూడా గోయల్ ఖండించారు. ఈ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ మద్దతివ్వడంపై కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ నెగిటివ్ ప్రచారాన్ని ప్రతిపక్ష నేత కూడా వల్లెవేయడం బాధాకరం. ఇలా చేసినందుకు ఆయన్ను నేను ఖండిస్తున్నా. భారత్ కథ ఇంత గొప్పగా ఉన్న సమయంలో ఇలా అవమానించిన రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదు’ అని పియూష్ గోయల్ పేర్కొన్నారు. దేశ కరెన్సీ, విదేశీ మారక నిల్వలు, స్టాక్ మార్కెట్లు, ఇతరత్రా అన్నీ చాలా బలంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని గుర్తుచేశారు.

‘ప్రపంచం అంతా మనదే అత్యంత వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్వవస్థ అని గుర్తిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు 16 శాతం సహకారం అందిస్తోంది’ అని గోయల్ స్పష్టంచేశారు. యూఏఈ, మారిషస్, ఆస్ట్రేలియా, ఈఎఫ్‌టీఏ కూటమి, యూకే, ఈయూ, చిలీ, పెరూ, న్యూజిల్యాండ్, యూఎస్ సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, కొన్ని దేశాలతో డీల్స్ తుదిదశకు చేరకున్నాయని పేర్కొన్నారు.

Next Story