Donald Trump: భారత్ సరైన చర్యలు తీసుకుంటుంది- వలసదారులపై మోడీతో చర్చించానన్న ట్రంప్

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Donald Trump: భారత్ సరైన చర్యలు తీసుకుంటుంది- వలసదారులపై మోడీతో చర్చించానన్న ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సోమవారం ఫోన్ కాల్ లో మాట్లాడారు. కాగా.. ఈ సంభాషణలో డొనాల్డ్ ట్రంప్ కీలక విషయం బయటపెట్టారు. ఫిబ్రవరిలో తాను మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. “నేను మోడీతో చాలా సేపు మాట్లాడాను. భారత్‌తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని.. వచ్చే నెలలో భారత ప్రధాని వైట్‌హౌస్‌కు రావొచ్చు" అని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్‌ సరైన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఇప్పటివరకు ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అంతకుముందు, రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే అంశాలకు, విశ్వసనీయ భాగస్వామ్యానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

భారత్ లోనే చిట్టచివరి పర్యటన

గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్.. తన చివరి పర్యటనగా భారత్‌కు రావడం గమనార్హం. 2020లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోడీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు 2019 సెప్టెంబరులో హ్యూస్టన్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ-ట్రంప్ ప్రసంగాలు చేశారు. ఈనెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వారం రోజులకు.. ట్రంప్‌తో మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఇకపోతే, అక్రమవలసలను అరికట్టేందుకు ట్రంప్ పూనుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం అమెరికాలో అక్రమంగా 18,000 మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నట్లు గుర్తించింది.

Next Story