సింగపూర్‌లో భారత్ vs పాక్.. టాప్ ఆర్మీ అధికారుల సమావేశాలు!

by Phanindra |

సింగపూర్‌లో భారత్ vs పాక్ వార్నింగులు. వేరు వేరు సమావేశాల్లో యుద్ధం, కశ్మీర్ అంశంపై మాట్లాడిన టాప్ ఆర్మీ అధికారులు!

సింగపూర్‌లో భారత్ vs పాక్.. టాప్ ఆర్మీ అధికారుల సమావేశాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: సింగపూర్ వేదికగా జరుగుతున్న షాంగ్రి-లా కార్యక్రమంలో భారత్, పాక్ సైనికాధికారులు పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీచేశారు. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, పాక్ చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషద్ మిర్జా వేరు వేరు కార్యక్రమాల్లో పొరుగు దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తను పాల్గొన్న సెషన్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ను సీడీఎస్ చౌహాన్ ప్రస్తావించారు. ‘ఈ మిషన్ మిలటరీ చర్యే అయినా కూడా పొరుగు దేశానికి కొన్ని పాఠాలు నేర్పుతుంది. భారత్ సహనానికి ఇదే హద్దు అనే విషయం వాళ్లకు అర్థమవుతుందని అనుకుంటున్నా’ అని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తూనే ఉందని, వీటిలో భారతీయులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన సీడీఎస్.. దీనికి ఒక ఫుల్‌స్టాప్ పెట్టాలని తాము నిర్ణయించుకున్నట్లు స్పష్టంచేశారు.

అదే సమయంలో పాకిస్తాన్ జనరల్ సాహిర్ షంషద్ మిర్జా మరో కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం దిశగా ఇరుదేశాలు అడుగులు వేయాలన్నారు. లేదంటే భయంకరమైన విధ్వంసం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దక్షిణాసియాలో శాంతికి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతిపాదన, ప్రజల ఆశలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడం చాలాముఖ్యమని ఆయన చెప్పారు. ‘ప్రస్తుత భారత విధానాల వల్ల సమస్య మేనేజ్ చేసే వ్యవస్థలు కూడా లేకుండా పోయాయి. దీంతో రెండు దేశాల మధ్య గొడవలు జరిగితే ప్రపంచ దేశాలు కల్పించుకొని సీజ్‌ఫైర్ చేయించేలోపే భారీ నష్టాలు, విధ్వంసం జరగొచ్చు’ అని మిర్జా హెచ్చరించారు. భారత్, పాక్ మధ్య అతిపెద్ద సమస్య కశ్మీరేనని ఆయన చెప్పారు. ఇరు దేశాలు సమస్యల పరిష్కారం దిశగా నడవకపోతే మళ్లీ మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయన్నారు.

Next Story