బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ జారీ!

by Naga Rani Yarlagadda |

బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ జారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు భారీ ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. బీమా సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు (FDI) ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి ఇస్తూ శనివారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో విదేశీ పెట్టుబడిదారులకు భారత బీమా రంగంలో మరింత విస్తృతంగా పెట్టుబడులు పెట్టే అవకాశం కలగనుంది. అయితే.. ఈ పెట్టుబడులు భారత బీమా చట్టం-1938 నిబంధనలకు లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విదేశీ పెట్టుబడులు స్వీకరించే సంస్థలు బీమా, అనుబంధ కార్యకలాపాలు నిర్వహించేందుకు Insurance Regulatory and Development Authority of India (IRDAI) నుంచి అవసరమైన లైసెన్స్ లేదా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.

LICకి ప్రత్యేక నిబంధనలు

ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ Life Insurance Corporation of India (LIC) విషయంలో మాత్రం ప్రత్యేక నిబంధనలు కొనసాగనున్నాయి. ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 20 శాతానికి మాత్రమే కట్టుబడి ఉంచారు. ఇది కూడా ఆటోమేటిక్ రూట్ ద్వారానే అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థల పాలనలో భారతీయులకు ప్రాధాన్యత కల్పించేలా కీలక నిబంధనను తీసుకొచ్చింది. సంస్థ బోర్డు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లలో కనీసం ఒకరు భారతీయ నివాస పౌరుడు అయి ఉండాలని స్పష్టం చేసింది.

ఇంటర్మీడియరీలకు కూడా వర్తింపు

ఈ నిర్ణయం కేవలం బీమా కంపెనీలకే పరిమితం కాకుండా, ఇన్సూరెన్స్ బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్ బ్రోకర్లు, ఇన్సూరెన్స్ కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు వంటి మధ్యవర్తి సంస్థలకూ వర్తించనుంది. వీటిలో కూడా 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి కల్పించారు.

ఆ బిల్లుతో కీలక మార్పులు

గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన Sabka Bima Sabki Raksha (Amendment of Insurance Laws) Bill, 2025 ద్వారా బీమా రంగ చట్టాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ బిల్లుతో బీమా చట్టం-1938, ఎల్‌ఐసీ చట్టం-1956, ఐఆర్‌డీఏ చట్టం-1999లో సవరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ మార్పులకు అనుగుణంగా కేంద్రం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉంటే.. భూసరిహద్దులు పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ కేంద్రం ఇటీవల నిబంధనలను సడలించింది. కొత్త మార్పుల ప్రకారం, అలాంటి దేశాల నుంచి 10 శాతం వరకు నియంత్రణ లేని వాటా పెట్టుబడులు ముందస్తు అనుమతి లేకుండానే ఆటోమేటిక్ రూట్‌లోకి రానున్నాయి. దీంతో భారతదేశంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story