చాబహార్ పోర్టును వీడుతున్న భారత్? ఎంత నష్టం జరుగుతుందో తెలుసా?

by Phanindra |

చాబహార్ పోర్టును భారత్ వీడుతున్నదని వార్తలు వచ్చాయి. ఇలా జరిగితే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా?

చాబహార్ పోర్టును వీడుతున్న భారత్? ఎంత నష్టం జరుగుతుందో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో భారత్ సహకారంతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టును మన దేశం వదిలి వచ్చేస్తుందా? వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ పోర్టును.. యూఎస్ ఒత్తిడి కారణంగా వదిలేస్తుందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం దిగుమతి సుంకాలు వేస్తామని ఇటీవలే యూఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లో చాబహార్‌లోని షాహిద్ బెహెష్టి పోర్టు కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌పై కూడా ఈ సుంకాల ప్రభావం పడే చాన్స్ ఉంది. ఈ కారణంగానే పోర్టు నుంచి భారత్ వెనక్కు వచ్చేస్తోందని సదరు కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికే యూఎస్‌ నుంచి 50 శాతం సుంకాలు ఎదుర్కొంటున్న భారత్.. మరో 25 శాతం సుంకాలు పడతాయనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. ప్రధాని మోడీ మరోసారి డొనాల్డ్ ట్రంప్ ముందు సరెండ్ అయిపోయారని, వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్టును వదిలి వచ్చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం భారత్ 132 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. భారత్ కనుక ఇప్పుడు ఆ పోర్టును వదిలి వచ్చేస్తే.. ఈ పెట్టుబడి వృధా అయినట్లేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.

సుంకాలు వేయడానికి ఏడాది ముందే..

ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ బదులిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు చాబహార్ పోర్టు నుంచి వ్యాపారం చేసినా ఎలాంటి సుంకాలు లేకుండా యూఎస్ నుంచి తమకు వైవర్ ఉన్నదని చెప్పారు. ఇరాన్‌పై యూఎస్ సుంకాలు వేస్తుందనే అనుమానాలతోనే.. సుమారు ఏడాది క్రితమే 132 మిలియన్ డాలర్ల సొమ్మును ఇరాన్‌కు భారత్ అందజేసేసినట్లు సమాచారం. యూఎస్ సుంకాలు వేస్తే.. ఈ ప్రక్రియ కష్టతరంగా మారుతుందనే అనుమానంతోనే భారత్ ఇలా చేసింది. ఇక గతేడాది సెప్టెంబరులోనే చాబహార్ పోర్టుపై పన్నులు వేయాలని యూఎస్ నిర్ణయించింది. అయితే చర్చలు జరిపిన భారత్.. ఆరు నెలలపాటు ఎలాంటి సుంకాలు లేకుండా ఒప్పందం చేసుకుంది. ఈ సమయాన్ని మరింత పొడిగించేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

నత్తనడకన సాగిన పనులు..

పాకిస్తాన్‌లో చైనా సహకారంతో గ్వాదర్ పోర్టు నిర్మిస్తుండటంతో.. వ్యూహాత్మకంగా అవసరమనే ఉద్దేశ్యంతో ఎప్పుడో 2003లో చాదహర్ పోర్టు కోసం భారత్ చర్చలు ప్రారంభించింది. 2015లో దీని కోసం ఎంవోయూపై సంతకాలు జరగ్గా.. 2018లో ఈ పోర్టులో కొంత భాగంలో ఆపరేషన్స్‌ను భారత్ హ్యాండోవర్ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయనే ఆలోచనతో 2024లో ఒకేసారి 10 ఏళ్లపాటు ఈ పోర్టులో భారత్ ఆపరేషన్స్ జరిగేలా ఇరాన్‌తో ఒప్పందం జరిగింది. ఇప్పటికీ అక్కడ ఇరాన్ పౌరులే భారత్ కోసం కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.

వ్యూహాత్మకంగా కీలకం..

భారత్ చుట్టూ అంతర్జాతీయ వాణిజ్యంలో చోక్ పాయింట్లను స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చైనా రకరకాలుగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే పాక్‌లో గ్వాదర్ పోర్టును నిర్మించింది. అంతర్జాతీయంగా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ (ముత్యాల దండ) స్ట్రాటజీతో భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసుందుకు చైనా ఇలా పావులు కదిపింది. దీనికి చెక్ పెట్టేందుకే భారత్ కూడా ‘నెక్లెస్ ఆఫ్ డైమండ్స్’ అనే పేరుతో వ్యూహం రచించింది. దీనిలో భాగంగానే ఇరాన్‌తో ఒప్పందం చేసుకొని చాబహర్ పోర్టు నిర్మాణంలో భాగమైంది. ఈ పోర్టు హోర్మూజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో అంతర్జాతీయంగా చాలా కీలకమైన చోక్‌ పాయింట్‌గా మారింది. దీంతో చైనాకు ఒక పక్క చెక్ పెడుతూనే.. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఏసియాకు జల రవాణా మార్గాన్ని అందిస్తుంది. ముంబైను రష్యా, యూరప్‌తో కలిపే ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌ (ఐఎన్‌సీటీసీ)లో కూడా ఇది చాలా కీలకం.

పోర్టు వదిలేస్తే ఎంత నష్టం?

చాబహార్ పోర్టు వల్ల భారత్‌కు ఆర్థికంగా పెద్దగా లాభం ఏమీ లేదనేది నిపుణుల మాట. దీని నిర్మాణం కోసం పెట్టి 132 మిలియన్ డాలర్లు కూడా వ్యూహాత్మక అవసరాల కోసమే అని వారంటున్నారు. చైనాకు చెక్ పెట్టడం, గ్వాదర్ పోర్టుపై నిఘా, హోర్మూజ్ జలసంధిపై ఒక కన్నేసి ఉంచడం.. వంటి వ్యూహాత్మక అవసరాలకే ఈ పోర్టు కీలకం. అందుకే ఈ పోర్టుతో పెద్ద లాభం లేకపోయినా.. అవసరం కాబట్టి భారత్ ఈ విషయంలో ముందడుగు వేసిందనేది నిపుణుల వాదన. ఇలాంటి సమయంలో యూఎస్ కనుక సుంకాలు వేయడం మొదలు పెడితే ఆర్థికంగా భారత్‌కు నష్టం వస్తుందని చెప్తున్నారు. ఇరాన్‌లో పెట్టింది 132 మిలియన్ల పెట్టుబడి అయితే.. యూఎస్‌తో భారత్ చేస్తోంది ఏటా 132 బిలియన్ డాలర్ల వ్యాపారం. దీనిపై 25 శాతం సుంకాలు పడితే 40 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చినట్లే. దానికితోడు ఎలాగోలా ఈ ఏడాది పూర్తిచేస్తే.. మరో రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ దిగిపోతారు. అప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భారత్ ఇలా చాబహార్ పోర్టు నుంచి వెనక్కు వచ్చేస్తే.. అది కచ్చితంగా చైనాకు ప్లస్‌గా మారుతుంది. అంతేకాదు భారత్ తప్పుకోగానే.. ఇరాన్‌తో చేతులు కలిపి ఈ పోర్టులో తామే భాగస్వాములుగా చైనా చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు హోర్మూజ్ జలసంధి చైనా చేతుల్లోకి వెళ్లినట్లే కదా. కాబట్టి భారత్‌ను ఇక్కడి నుంచి పంపించేయడం యూఎస్‌కు కూడా ఉపయోగకరం కాదని విశ్లేషకులు చెప్తున్నారు.

Next Story