ఇండియా కూటమిలో చేరే ప్రసక్తే లేదు: బీఎస్పీ చీఫ్ మాయవతి

by Dishanational2 |
ఇండియా కూటమిలో చేరే ప్రసక్తే లేదు: బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఇండియా కూటమిలో చేరబోతుందనే వార్తలను ఆ పార్టీ చీఫ్ మాయవతి కొట్టిపారేశారు. ప్రతిపక్ష కూటమిలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించినా కొన్ని పార్టీలు పొత్తులపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే బీఎస్పీ లేకుండా ఉత్తరప్రదేశ్‌లో పలు పార్టీలు రాణించలేవని అర్థం అవుతుందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తోందని వెల్లడించారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో నిలవాలని బీఎస్పీ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రజలు పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘పొత్తులతో ఎల్పప్పడూ మాకు లాభదాయకం కాదు. దీనివల్ల ఎక్కువ నష్టపోతున్నాం. చాలా పార్టీలు బీఎస్పీతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తున్నప్పటికీ వాటిని తిరస్కరిస్తున్నాం. ఎన్నికల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తాం’ అని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు బీఎస్పీకి ఇండియా కూటమి తలుపులు తెరిచే ఉన్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వాటిపై మాయవతి క్లారిటీ ఇచ్చారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో 1990-2000లలో బీఎస్పీ ప్రధాన రాజకీయ పార్టీగా ఉండగా.. ఆ తర్వాత అంతగా ప్రభావం చూపలేదు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ పార్టీ కేవలం 12.8 శాతం ఓట్లను మాత్రమే సాధించింది.


Next Story

Most Viewed