- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైసా ఆదాయం లేకపోయినా.. 383 కంపెనీలు నడుపుతున్న ప్రభుత్వాలు
పైసా ఆదాయం లేకపోయినా 383 కంపెనీలను ప్రభుత్వాలు నడుపుతున్నాయి. దీని ఖర్చు ఎవరు భరిస్తారు?

దిశ, నేషనల్ బ్యూరో: ఏటా ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నామని దేశమంతా కూర్చొని బడ్జెట్ వేసుకునే మన దేశంలో.. ప్రభుత్వం వద్దే అసలేం పనిచేయని కంపెనీలున్నాయి. తాజా లెక్కల ప్రకారం, కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న 383 కంపెనీల వల్ల ఖజానాకు పైసా కూడా లాభం లేదు. ఇలాంటి వాటిని ‘ఘోస్ట్ కంపెనీలు’ అని నిపుణులు పిలుస్తున్నారు. వీటి వల్ల ఆయా ప్రభుత్వాలకు భారీగా నష్టాలేం రావడం లేదు. అందుకని ఆదాయం కూడా లేదు. కొన్నింట్లో అయితే ఉద్యోగులు కూడా తక్కువే. ఈ కంపెనీలు వాస్తవానికి ఏ పనీ చేయవు. జస్ట్.. ప్రభుత్వ రంగంలో అలా ఉన్నాయంతే. నష్టం లేనప్పుడు ఉంటే ఏమైంది? అంటే.. ఇక్కడ సమస్య ఆర్థిక నష్టం ఒక్కటే కాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం. ప్రభుత్వం వీటిని మూసివేయడమో, వేరే కంపెనీలతో మెర్జ్ చేయడమో, గాడిన పెట్టడమో ఏదో ఒకటి చేయాలి కదా. కానీ అలాంటి చర్యలు ఏవీ జరగడం లేదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఇవి ఇలా కంటిన్యూ అయిపోతున్నాయనేది కాదనలేని సత్యం.
ఘోస్ట్ కంపెనీలు ఎలా పుట్టాయంటే?
మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నాం. ఆ సమయంలో అభివృద్ధి అవసరం. అందుకే ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వం.. సొంతంగా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసింది. ఆ సమయంలో హెవీ ఇండస్ట్రీలు, టెలీకమ్యూనికేషన్స్ వంటి ఎన్నో రంగాల్లో భారత ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే 1991లో ఆర్థికశాఖను సడలీకరించడంతో ప్రైవేటు రంగం పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ రంగంలో అలసత్వంగా పనిచేస్తున్న ఎన్నో సంస్థలు.. ప్రైవేటు రంగం నుంచి వచ్చే పోటీని తట్టుకోలేకపోయాయి. చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు పరిస్థితులకు తగ్గట్లు మారినా.. కొన్ని మాత్రం అలాగే మిగిలిపోయాయి. కొన్నింటిని ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేశాయి. కొన్నింటిని కలిపి ఈ రంగంలో స్థిరత్వాన్ని తెచ్చాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఈ చర్యలకు నోచుకోలేదు. ఏమీ చేయకుండా అలా మిగిలిపోయాయి. ఇవే నేడు ‘ఘోస్ట్ కంపెనీలు’గా మారాయి.
ఎందుకు మూసేయరు?
కొన్ని ఆర్థిక, వ్యూహాత్మక అవసరాల కోసం పెట్టిన కంపెనీలు.. ఆ లక్ష్యాల అవసరం లేనప్పుడు కంపెనీలకు లేకుండా పోతుంది. అలాంటప్పుడు ఆ కంపెనీలు ప్రభుత్వ బాధ్యతలుగా మిగిలిపోతాయి. అలాంటి ఏమాత్రం ఆదాయం లేని, అనవసరమైన కంపెనీలను మూసివేయడం ఎవరైనా చేసే పని. కానీ ప్రభుత్వాలు వీటిని కొనసాగించడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది రాజకీయ సమస్య.
1. ప్రభుత్వ రంగ సంస్థను మూసివేస్తున్నా, ప్రైవేటు పరం చేస్తున్నా.. రాజకీయంగా దుమారం రేగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు విలువనిచ్చే మన సమాజంలో ఆ జాబ్స్ పోతాయనే ఆందోళన ప్రభుత్వంపై ఆగ్రహంగా మారుతుంది. ఈ రిస్క్‌ను ప్రభుత్వాలు తీసుకోవడానికి ఇష్టపడవు.
2. అలాగే ప్రభుత్వ రంగ కంపెనీని మూసేయడం అంత సులభంగా ముగిసే ప్రక్రియ కాదు. ఆస్తుల లెక్కింపు, అప్పుల చెల్లింపు, ఉద్యోగులకు పరిహారం, కేబినెట్ స్థాయి అనుమతులు.. ఇలా ఎన్నో నిర్ణయాలు అవసరం. ఇక ప్రధాన నగరాల్లో ఉన్న కంపెనీలయితే.. అవి ఉన్న భూముల విలువ కూడా కీలకమే. వీటన్నింటినీ దాటి కంపెనీ మూసేయడం కంటే.. అలా కంటిన్యూ చేయడమే బెటర్ అనే అలసత్వం ప్రభుత్వానికి వచ్చేస్తుంది.
3. ఒకవేళ సదరు ఘోస్ట్ కంపెనీ ఏదైనా కోర్టు కేసులో ఉంటే.. అది ముగిసే వరకు కంపెనీ మూసేయడం కుదరని పని.
4. కొన్ని కంపెనీలు కేవలం ఆస్తులుగానే మిగిలిపోయే సందర్భాలూ ఉంటాయి. ల్యాండ్ బ్యాంక్స్, చారిత్రతక కట్టడాలు కనుక ఈ కంపెనీల వద్ద ఉంటే.. ఆ అవసరాల కోసం కంపెనీని కొనసాగిస్తూనే ఉంటుంది ప్రభుత్వం.
ప్రభుత్వానికి ఖర్చు ఉండదా..?
అటు లాభం, ఇటు నష్టం లేని కంపెనీని నడపడం వల్ల ప్రభుత్వంపై భారం లేకపోతే అవి ఉన్నా ఎవరికీ ఇబ్బంది ఉండదు. అయితే కంపెనీ అన్నాక ఏటా కొన్ని బాధ్యతలు నిర్వర్తించక తప్పదు. ప్రతి కంపెనీలో డైరెక్టర్లు ఉండాలి. వార్షిక ఫైలింగులు, చట్టబద్ధమైన బోర్డు సభ్యులు, రికార్డులు చూసుకోవడం, ఉద్యోగులు ఉంటే జీతాలు, మాజీ ఉద్యోగులకు పెన్షన్లు.. ఇవన్నీ కచ్చితంగా చూసుకోవాల్సిందే. వీటన్నింటికీ ఎంతో కొంత ఖర్చవుతుంది. ఒక కంపెనీ నడపడానికి అయ్యే ఈ ఖర్చు భరించలేనంత పెద్దదేం కాదు. ఇక్కడే సమస్య పెద్దదవుతుంది. ఒక ఘోస్ట్ కంపెనీ నడిపేందుకు అయ్యే ఖర్చు తక్కువే.. కానీ ఒకేసారి 383 ఘోస్ట్ కంపెనీలు నడిపితే? ఎంత తక్కువ ఖర్చయినా దానికి 383 రెట్లు అంటే పెద్ద మొత్తమే అవుతుంది కదా? అయినా సరే ఈ ఘోస్ట్ కంపెనీల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.






