బిగ్ బ్రేకింగ్ : పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-03 07:21:26  IST  )

పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

బిగ్ బ్రేకింగ్ : పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్థాన్ కు సింధు జలాల పంపిణీ (Indus Water) నిలిపివేయడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్న భారత్.. తాజాగా మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అల్లాడుతోన్న పాకిస్థాన్‌కు ఇది నిజంగానే దిమ్మతిరిగే షాక్ అని విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్థాన్ లో దొరికే, అక్కడ తయారయ్యే అన్ని వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఎలాంటి వస్తువులు పాక్ నుంచి భారత్ దిగుమతి చేసుకోదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ పాక్ వస్తువులపై నిషేధం తక్షణమే అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్యశాఖ స్పష్టం చేసింది.

భారత్ పాకిస్థాన్ నుంచి ప్రధానంగా ఔషధ ఉత్పత్తులు, ఫ్రూట్స్, నూనె గింజలను దిగుమతి చేసుకుంటుంది. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ దిగుమతులపై 200% టారిఫ్ విధించింది. ఆ తర్వాత టారిఫ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. 2024-25లో మొత్తం దిగుమతుల్లో ఇది 0.0001% కంటే తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. తాజాగా పహల్గామ్ బైసారన్ వ్యాలీలో నేపాల్ పర్యాటకుడు, స్థానిక పోనీ గైడ్ ఆపరేటర్ సహా 26 మంది పౌరుల్ని ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం 1960లో ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాక్ జాతీయుల అన్ని రకాల వీసాలన్నింటినీ రద్దు చేసింది. భారత్ లో ఉంటోన్న పాక్ పౌరులంతా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని గడువు విధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ దళాలు భారత సైనిక పోస్టులపై లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో నియంత్రణ రేఖ (LoC) అంతర్జాతీయ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, సరిహద్దు వెంబడి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందిస్తోందని భారతదేశం పదే పదే ఆరోపిస్తోంది. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) నుండి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే వరకు ఢిల్లీ.. ఇస్లామాబాద్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు జరపదని హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నొక్కి చెప్పారు.

Next Story