- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం.. మూడు స్వదేశీ యుద్ధనౌకలతో ఆ దేశాలకు చెక్!
భారత నౌకాదళంలో ఇదొక సువర్ణాధ్యాయం. జూన్ 21న మన నౌకాదళంలోకి మూడు కొత్త యుద్ధ నౌకల్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత నౌకాదళంలో ఇదొక సువర్ణాధ్యాయం. జూన్ 21న మన నౌకాదళంలోకి మూడు కొత్త యుద్ధ నౌకల్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టారు. సముద్రగర్భంలో శత్రువుల్ని వేటాడేందుకు, లోతైన సముద్రాలను మ్యాపింగ్ చేసేందుకు, సముద్ర సరిహద్దుల్లో పహారా కాసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మూడు యుద్ధనౌకలు నేవీలోకి అడుగుపెట్టాయి. అవే ఐఎన్ఎస్ దునగిరి (INS Dunagiri), ఐఎన్ఎస్ సంశోధర్ (INS Sanshodhak), ఐఎన్ఎస్ అగ్రయ్ (INS Agray). ఈ మూడు నౌకల్ని కోల్ కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE) సంస్థ తయారు చేసింది. వీటి తయారీకి 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాకుండా.. దేశంలో దాదాపు 200 మొక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (MSME)లు కూడా వీటి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాయి. ఒక్కో నౌకకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
ఐఎన్ఎస్ దునగిరి (INS Dunagiri) విషయానికొస్తే.. శత్రువుల రాడార్లకు చిక్కని స్టీల్త్ ఫ్రిగేట్ ఉన్న ఈ నౌక మూడింటిలోకెల్లా పెద్దది, శక్తివంతమైనది కూడా. ప్రాజెక్టు 17A కింద రూపొందించిన అత్యాధునిక గైడెడ్-మిస్సైల్ ఫ్రిగేట్. ఇది శత్రువుల రాడార్లు, సెన్సార్ల కంటికి అంత సులభంగా చిక్కదు. ఇందులో స్వదేశీ బ్రహ్మోస్ ఉపరితలం నుంచి.. ఉపరితలానికి దూసుకెళ్లే క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ, మల్టీ ఫంక్షన్ నిఘా రాడార్, సోనార్ వ్యవస్థలు, యాంటీ సబ్ మెరైన్ ఆయుధాలు ఉన్నాయి. బ్లూ వాటర్ ఎన్విరాన్మెంట్లోనూ శత్రువుల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఐఎన్ఎస్ దునగిరికి ఉంది.
ఐఎన్ఎస్ సంశోధక్ (INS Sanshodhak) విషయానికొస్తే.. సముద్రాన్ని మ్యాపింగ్ చేసే సైంటిఫిక్ నౌక ఇది. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం రోజునే.. అత్యంత అధునాతన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక అయిన ఐఎన్ఎస్ సంశోధక్ నేవీలో చేరడం విశేషం. సముద్రపు లోతును కొలవడం, సముద్ర గర్భంలో ఉన్న పర్వతాలు, లోయలను గుర్తించడం, రేవులకు వెళ్లే మార్గాలను మ్యాపింగ్ చేయడం, సముద్రశాస్త్ర డేటాను సేకరించడం ఈ నౌక ప్రత్యేకతలు. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు సముద్రంలో సురక్షితంగా ప్రయాణించాలన్నా, వ్యూహాత్మక మార్గాలను ఎంచుకోవాలన్నా ఈ నౌక అందించే సమాచారమే అత్యంత కీలకం. ఇది సంధాయక్ క్లాస్ సర్వే నౌకల్లో చివరిది. ఇవన్నీ చేయడానికి నౌకలో అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, మల్టీ బీమ్ ఎకో సౌండర్స్ వంటి పరికరాలను అమర్చారు.
ఐఎన్ఎస్ అగ్రయ్ (INS Agray) విషయానికొస్తే.. తీరప్రాంత సబ్ మెరైన్ హంటర్ గా నేవీలోకి వెళ్లిన ఈ నౌక సైజులో చిన్నదైనా.. సముద్రతీర ప్రాంతాల్లో శత్రువుల సబ్ మెరైన్లను వెతికి వేటాడటంతో ఆరితేరిందని చెప్తోంది రక్షణశాఖ. తీరానికి దగ్గరగా ఉండే లోతు తక్కువ జలాలను.. అంటే లిటోరల్ వాటర్స్ లో చేపల బోట్లు, ఇతర నౌకల వల్ల శబ్దాలు ఎక్కువగా ఉండి సబ్ మెరైన్లను గుర్తించడం కష్టం. వాటిని ఈజీగా గుర్తించేందుకే ఈ ఐఎన్ఎస్ అగ్రయ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. శత్రువుల జలాంతర్గాములను ముంచేసేందుకు లైట్ వెయిట్ టార్పెడోలు, స్వదేశీ యాంటీ సబ్ మెరైన్ రాకెట్ లాంచర్లు, అధునాతన సోనార్ వ్యవస్థలను అమర్చారు. ఈ నౌకలో ట్రెడిషనల్ ప్రొపెల్లర్లకు బదులుగా వాటర్ జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీని వాడారు. ఇది నీటిని లోపలికి లాక్కొని, అంతే వేగంతో వెనక్కి నెట్టడంతో నౌక వేగంగా కదిలేందుకు సహాయపడుతుంది. భారత రక్షణ రంగం ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ల నుండి హిందూ మహాసముద్రంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఈ త్రివిధ నౌకల చేరిక ద్వారా భారత నేవీ తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంది. మూడు భిన్నమైన సాంకేతికతలు కలిగిన నౌకలను ఒకేసారి స్వదేశంలో నిర్మించి ప్రవేశపెట్టడం.. రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ కి ఒక బలమైన నిదర్శనం.






