మయన్మార్‌కు భారత్ భారీ సాయం

by Ajay Maddhiboyina |

భారీ భూకంపం వల్ల ప్రభావితమైన మయన్మార్ ప్రజల కోసం 'ఆపరేషన్ బ్రహ్మ' పేరుతో సాయం చేస్తున్నారు.

మయన్మార్‌కు భారత్ భారీ సాయం
X

- 15 టన్నుల సామాగ్రి పంపిన ఇండియా

- భూకంప బాధిత దేశానికి వైమానిక విమానంలో సామాగ్రి

- ఆపరేషన్ బ్రహ్మ పేరుతో తక్షణ సాయం

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పొరుగు దేశమైన మయన్మార్‌లో అత్యంత భారీ భూకంపం కారణంగా 700 మంది మరణించగా.. వెయ్యికి పైగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులు అయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, భూకంప బాధిత మయన్మార్‌కు తక్షణ సాయం అందించడానికి భారత్ ముందుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడిన వారికి ఉపశమనం కలిగించడానికి 'ఆపరేషన్ బ్రహ్మ'ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సహాయ సామాగ్రితో భారత వైమానిక దళానికి చెందిన కార్గో విమానం శనివారం ఉదయం యాంగోన్‌కు చేరుకుంది. ఇది ఉపశమన ప్యాకేజీలో మొదటి దశ మాత్రమే అని, ఆ తర్వాత మరింత సాయం అందిస్తామని భారత అధికారులు తెలిపారు.

భారీ భూకంపం వల్ల ప్రభావితమైన మయన్మార్ ప్రజల కోసం 'ఆపరేషన్ బ్రహ్మ' పేరుతో సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఆహార ప్యాకెట్లు, హైజీన్ కిట్లు, జనరేటర్లు, అవసరమైన మొదలు సహా ఇతర వస్తువులు కలిపి 15 టన్నుల సామాగ్రిని మొదటి విడతలో యాంగోన్‌కు చేర్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇన్‌స్టాంట్ ఫుడ్, నీటి శుద్ది పరికరాలు, సౌర దీపాలు, పారాసెటమల్ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్స్, కాన్యులా, సిరంజిలు, గ్లౌస్‌లు, కాటన్ బ్యాండేజీలు, మూత్ర సంచులను తక్షణ అవసరం నిమిత్తం పంపినట్లు ఆయన తెలిపారు. మయన్మార్ అధికారుల విన్నపం మేరకు అమెరికాతో పాటు అనేక దేశాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

శుక్రవారం మయన్మార్‌తో పాటు దాని పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌లో శక్తివంతమైన భూకంపాలు కుదిపేశాయి. తీవ్రమైన భూకంపం ఆ రెండు దేశాల్లో విధ్వంసం సృష్టించింది. అనేక భవనాలు కూలిపోగా.. వేలాది మంది ప్రజలకు నిలువ నీడలేకుండా పోయింది. భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఇండియా సహాయం అందించింది. మయన్మార్‌కు అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Next Story