Income tax: మారనున్న ఐటీ చట్టం .. బడ్జెట్ సెషన్‌లో కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

by vinod kumar |
Income tax: మారనున్న ఐటీ చట్టం .. బడ్జెట్ సెషన్‌లో కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన 2025-26కు సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లుతో 64 ఏళ్ల నాటి ఇన్‌కమ్ టాక్స్ చట్టంలో పలు మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. చట్టంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను సరళీకృతం చేయడం, అనవసరమైన వాటిని తొలగించడం, సాధారణ ప్రజలకు భాషను అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను 60 శాతం తగ్గించమే లక్ష్యంగా బిల్లును రూపొందించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala seetharaman) గతేడాది బడ్జెట్‌ సందర్భంగా ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం-1961పై ఆరు నెలల్లో సమీక్షిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించి కొత్త బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ముసాయిదాను పరిశీలిస్తున్న న్యాయశాఖ!

కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ రెండో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. ఇది కొత్త చట్టం అవుతుందని, కానీ ప్రస్తుత చట్టానికి సవరణ కాదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ముసాయిదా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది చివరి దశకు చేరుతుందని త్వరలోనే తుది రూపం దాలుస్తుందని సమాచారం. అయితే ప్రభుత్వం మొదట్లో ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదా చట్టాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, సంక్లిష్టమైన పన్ను చట్టాలపై విమర్శల మధ్య మరింత దృఢమైన విధానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. కాగా, బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు రెండు సెషన్లుగా జరగనున్నాయి.

గతంలోనే కమిటీ ఏర్పాటు

గతేడాది బడ్జెట్ ప్రకటన తర్వాత ఆర్థిక మంత్రి సీతారామన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సమీక్షను పర్యవేక్షించడానికి, ఐటీ చట్టం-1961ని సమీక్షించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. అంతేగాక చట్టంలోని వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను నియమించారు. అనంతరం నాలుగు విభాగాలలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోగా ఆదాయపు పన్ను శాఖ వాటాదారుల నుంచి 6,500 సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ న్యాయశాఖ పరిశీలించి కొత్త బిల్లు తయారు చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఐటీ చట్టం-1961లో పలు పన్నులకు సంబంధించిన సుమారు 298 సెక్షన్లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిని తగ్గించాలని భావిస్తోంది.

Next Story