నాకేం జరిగినా ఆయనదే బాధ్యత : పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) జైల్లో తనకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌దేనని తెలిపారు.

నాకేం జరిగినా ఆయనదే బాధ్యత : పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) జైల్లో తనకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌దేనని తెలిపారు. ఈ విషయాన్ని తన పార్టీ సభ్యులకు కూడా స్పష్టం చేసినట్టు చెప్పారు. 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో తనపై జరుగుతున్న వేధింపులు మరింత తీవ్రతరమయ్యాయని అన్నారు. ఇమ్రాన్‌కు మద్దతుగా పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌) కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతుండగా, ఆయన ఈ ప్రకటన చేశారు.

‘‘నా భార్య బుష్రా బీబీ కూడా జైలులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టీవీ వంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా ఆమె వద్ద నుంచి తొలగించారు. మేము ఇద్దరం మనుషులుగా ఉండదగిన ప్రాథమిక హక్కుల నుంచే వంచించబడ్డాం. అసలు ఉగ్రవాదులు, నేరస్తులకూ మించిన వేధింపుల్ని మేము ఎదుర్కొంటున్నాం’’ అని ఆరోపించారు. ఇవి అన్నీ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని తనకు స్పష్టంగా తెలుసన్నారు. జైల్లో తనకు ఏదైనా అపాయం జరిగినా, ప్రజలు, పార్టీ నేతలు అతనినే బాధ్యుడిగా చూడాలని సూచించారు.

‘‘గత సంఘటనల్ని పరిగణనలోకి తీసుకుంటే, నా భార్య పట్ల అసీం మునీర్‌కు వ్యక్తిగత ద్వేషమే కారణమై ఇలా జరుగుతోంది. ఆమెను ఉద్దేశించుకొని నాపై ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. జైలులో జీవితాంతం గడిపేందుకు నేను సిద్ధమే. కానీ దమనకాండ ముందు తలవంచే ప్రసక్తే లేదు. ఇప్పుడు చర్చల కాలం ముగిసింది. ప్రజలందరూ నిరసనల కోసం సిద్ధంగా ఉండాలి’’ అని ఖాన్‌ పిలుపునిచ్చారు.

Next Story