చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే ఆస్పత్రి లైసెన్స్ రద్దు

by Shamantha N |
చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే ఆస్పత్రి లైసెన్స్ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. నవజాత శిశువుల అక్రమ రవాణా (Newborn trafficked) కేసులో అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (Uttar Pradesh government) తీరుపై మండిపడింది. ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేరాలను తగ్గించేందుకు యూపీ ప్రభుత్వానికి కఠిన మార్గదర్శకాలు ఇచ్చింది. ‘‘కుమారుడిని కావాలని ఆశపడిన వ్యక్తి.. రూ.4 లక్షలకు చిన్నారిని కొన్నాడు. ఒకవేళ బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదు. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసు. ఇలాంటివారు సమాజానికి ముప్పు. నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్‌లో తప్పకుండా హాజరుకావాలి. కానీ, దీనిపై దృష్టిసారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు’’ అని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్రమ రవాణా పెండింగ్‌ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలని సూచించింది. రోజూవారీ విచారణను కూడా చేపట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

నవజాత శిశువు చోరీ..

ఇకపోతే, యూపీలో ఇటీవలే ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు చోరీ జరిగింది. దీన్ని గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును నిందితుడు విక్రయించాడు. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ తర్వాత ఈ కేసుపై చిన్నారి తల్లిదండ్రులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టుపై మండిపడింది. నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్‌ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.



Next Story

Most Viewed