ఆరోగ్యం పదిలం అనుకుంటే పొరపాటే! మురికి నీటిలో కడుగుతున్న తాజా ఆకుకూరలు!

by Ramesh Naini |

పచ్చగా పాచి పట్టిన మురికి కుంటలో ఓ వ్యాపారి పాలకూర, ఇతర ఆకుకూరలను కడుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఆరోగ్యం పదిలం అనుకుంటే పొరపాటే! మురికి నీటిలో కడుగుతున్న తాజా ఆకుకూరలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనం తినే తాజా కూరగాయలు నిజంగా ఆరోగ్యకరమేనా? నోయిడాలో వెలుగుచూసిన ఓ షాకింగ్ వీడియో చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. పచ్చగా పాచి పట్టిన మురికి కుంటలో ఓ వ్యాపారి పాలకూర, ఇతర ఆకుకూరలను కడుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. సదరు వ్యాపారి నేరుగా ఆ మురికి నీటిలో దిగి ఆకుకూరలను కడుగుతున్నాడు. మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతనికి పక్కనే అదే నీటి వద్ద బర్రెలు కూడా ఉన్నాయి. ఆహార భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి కనీస పరిశుభ్రత లేకుండా వ్యవహరిస్తున్న ఆ వ్యాపారి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ప్రాణాలతో చెలగాటం..

ఇలాంటి కలుషితమైన నీటిలో కడిగిన కూరగాయల ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, జబ్బులు తెచ్చే క్రిములు సులభంగా వినియోగదారుల దరిచేరుతాయని ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను, ముఖ్యంగా ఆకుకూరలను వండుకోవడానికి లేదా తినడానికి ముందు ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యాపారులపై సంబంధిత అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్లలో నిఘా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story