- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saif Ali Khan: సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహాయుతి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. ముంబైలో సెలబ్రిటీలపై వరుస దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు.”ముంబైలో మరో హైప్రొపైల్ వ్యక్తిపై హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారు. ప్రముఖులే లక్ష్యంగా ముంబైని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగా చేసే చర్యలా కన్పిస్తోంది.” అని ప్రియాంక సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు. ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుటుంబం ఇంకా వేచి చూస్తోందని అన్నారు. నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నా.. ప్రభుత్వం తగిన రక్షణ కల్పించట్లేదన్నారు. సల్మాన్ బాంద్రాలోని తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం తగిన భద్రత ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు.
నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షాలు
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ సైఫ్ అలీఖాన్‌పై దాడి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఉదాసీనత వల్లే నిందితులు చట్టానికి భయపడట్లేదని.. ప్రముఖులపై వరుస దాడులే దానికి నిదర్శమని మండిపడ్డారు. సైఫ్‌పై జరిగిన దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్ష పేర్కొన్నారు. ముంబైలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని.. ప్రముఖులు ఉంటున్న సురక్షిత ప్రాంతం బాంద్రాలో ఇలా జరగడం ఆందోళన కల్గిస్తోందన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సైఫ్ దాడి ఘటనపై అధికార బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందించారు. నటుడిపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. నిందితుడ్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమన్నారు. దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.






