BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-02 10:12:35  IST  )

ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్ లో ముగ్గురు జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది.

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం భారీ ఐఈడీ (IED) పేలుడు సంభవించింది. జిల్లాలోని ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను తొలగిస్తుండగా ఈ పేలుడు జరిగింది. మందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక్కసారిగా ఐఈడీ పేలుడు సంభవించడంతో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ పేలుడు ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కావడంతో.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టు ముక్త్ రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి పేలుడు సంఘటన ఇదే కావడం గమనార్హం.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

దశాబ్దాల కాలంగా బస్తర్ ప్రాంతంలోని అడవుల్లో నక్సలైట్లు పెద్ద ఎత్తున మందుపాతరలను పాతిపెట్టారు. గత నెలలోనే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నక్సల్ రహితంగా ప్రకటించినప్పటికీ, భూమిలో పూడ్చిపెట్టిన ఈ పేలుడు పదార్థాలు భద్రతా బలగాలకు, స్థానిక ప్రజలకు ఇంకా సవాలుగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్న బాంబులను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియను భద్రతా దళాలు వేగవంతం చేశాయి. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Next Story