ఐఏఎస్ అధికారిణికి గృహహింస వేధింపులు.. ఐఏఎస్ భర్త మోదీపై కేసు

by Naga Rani Yarlagadda |

గృహహింస వేధింపులు అనగానే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు.

ఐఏఎస్ అధికారిణికి గృహహింస వేధింపులు.. ఐఏఎస్ భర్త మోదీపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: గృహహింస వేధింపులు అనగానే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. కానీ.. ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నత పదవిలో, ఉన్నతస్థాయిలో ఉన్నా.. ఈ వేధింపులు తప్పట్లేదు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారిణి తన ఐఏఎస్ భర్తపై గృహహింస వేధింపులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో భారతి దీక్షిత్ అనే ఐఏఎస్ అధికారిణి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె భర్త ఆశిష్ మోదీ(IAS) సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

వీరిద్దరూ 2014 బ్యాచ్ కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులు. 2014లోనే పెళ్లి చేసుకోగా.. అప్పటి నుంచి ఆశిష్ మోదీ తరచూ ఆల్కహాల్ తాగి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు జైపూర్ పోలీసులకు భారతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో.. తన భర్తకు కొందరు నేరస్తులతో పరిచయాలున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ లో ఒక గవర్నమెంట్ వెహికల్ లో తనను కిడ్నాప్ చేసి.. గంటల సమయం పాటు నిర్బంధంలో ఉంచారని ఫిర్యాదులో తెలిపారు. విడాకులకు ఒప్పుకోకపోతే తనతోపాటు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆశిష్ మోదీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఆశిష్ అందుబాటులో లేకపోవడంతో అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Next Story