ప్రియుడే కావాలంటూ సెల్ టవర్ ఎక్కిన భార్య

by Prasad Jukanti |   (  Updated:2026-04-29 06:42:10  IST  )

ప్రియుడు కావాలని కోరుతూ ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించింది. తన వివాహం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని తేల్చి చేప్పింది.

ప్రియుడే కావాలంటూ సెల్ టవర్ ఎక్కిన భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలో వివాహానికి, దాంపత్య జీవితానికి ఎంతో విలువ ఉంది. నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని పెళ్లి నాడు పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పరాయి వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న బంధాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తనకు ప్రియుడే కావాలంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

మరో వ్యక్తిని ప్రేమిస్తున్నాను:

పూజ (30) అనే మహిళకు బర్మనే గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతోనే ఉంటున్న పూజ గత మంగళవారం మధ్యాహ్నం అనూహ్యంగా అత్తారింటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆమె కిందకు దిగి రాలేదు. మండుటెండలో దాదాపు మూడు గంటల పాటు వారిని ముప్పుతిప్పలు పెట్టిన పూజ.. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో కిందకు దిగివచ్చింది. అనంతరం తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారని తాను భర్తతో ఉండలేనని చెప్పింది. తాను సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానని అతడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను పోలీసులకు వివరించింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story