ఆధార్ ఫొటోలో బుర్ఖా వేసుకోలేదని భార్య దారుణ హత్య

by Naga Rani Yarlagadda |

ఆధార్ కార్డులో అప్డేట్ కోసం దిగిన ఫొటోలో భార్య బుర్ఖా ధరించలేదన్న కోపంతో భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు.

ఆధార్ ఫొటోలో బుర్ఖా వేసుకోలేదని భార్య దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డులో అప్డేట్ కోసం దిగిన ఫొటోలో భార్య బుర్ఖా ధరించలేదన్న కోపంతో భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. గతంలో అతను తన ఇద్దరు కూతుళ్లను కూడా చంపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని షామ్లిలో జరిగింది. ఫరూఖ్ - తాహిరాలకు 18 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఐదుగురు సంతానం. అఫ్రీన్ (14), అస్మీన్ (10), సెహ్రీన్ (7), బిలాల్ (9), అర్షద్ (5). 18 ఏళ్లుగా ఒక్కసారి కూడా తాహిరాను బుర్ఖా లేకుండా ఇతరులకు కనిపించేందుకు అనుమతించలేదని, చివరికి రేషన్, ఆధార్ కార్డుల్లోనూ ఆమె బుర్ఖా ధరించే ఉందని పోలీసులు గుర్తించారు. ఇటీవల పుట్టింటికి వెళ్లిన తాహిరా.. బుర్ఖా వేసుకోలేదన్న విషయం ఫరూఖ్ తెలుసుకున్నాడు. దీంతో ఎంతో కోపంతో రగిలిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చాక ఈ విషయమై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. దాంతో వంటగదిలో భార్యను చంపాడు. అరుపులు, శబ్దాలకు లేచిన ఇద్దరు కూతుళ్లలో అఫ్రీన్ ను కాల్చి చంపాడు. సెహ్రీన్ ను గొంతుకోసి హతమార్చాడు. భార్య, పిల్లల మృతదేహాలను ఇంటి ప్రాంగణంలో టాయిలెట్ కోసం తవ్విన 9 అడుగుల గొయ్యిలో పాతిపెట్టాడు.

డిసెంబర్ 10న ఈ హత్యలు జరగ్గా.. ఫరూఖ్ తండ్రికి కోడలు, పిల్లలు కనిపించకపోవడంపై అనుమానం కలిగింది. పదే పదే వారి గురించి ప్రశ్నించగా.. అద్దె ఇంటిలో ఉంచినట్లు అబద్ధం చెప్పాడు. ఫరూఖ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి... గట్టిగా నిలదీయడంతో భార్య, ఇద్దరు కూతుళ్లను చంపినట్లు చెప్పాడు. ఫరూఖ్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫరూఖ్ నుంచి ఒక పిస్తల్ ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story