'ఇషా ఫౌండేషన్‌'కు సుప్రీంలో భారీ ఊరట

by Yella Dhawani Reddy |

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తమిళనాడులోని వెల్లియంగిరిలో స్థాపించిన ఇషా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.

ఇషా ఫౌండేషన్‌కు సుప్రీంలో భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తమిళనాడులోని వెల్లియంగిరిలో స్థాపించిన ఇషా ఫౌండేషన్‌కు (Isha Foundation) సుప్రీం కోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (TNPCB) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. యోగా, మెడిటేషన్‌ సెంటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. అలాగే, ఇషా ఫౌండేషన్‌కు కాలుష్య బోర్డు పంపించిన నోటీసులపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.

2006, 2014 మధ్య కాలంలో కోయంబత్తూరులోని వెల్లియంగిరి కొండలలో పర్యావరణ అనుమతి పొందకుండా నిర్మాణ పనులు చేపట్టారని సద్గురు ఇషా ఫౌండేషన్‌కు 2021లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2022లో మద్రాసు హైకోర్టు ఇషా ఫౌండేషన్‌ను 'విద్యా సంస్థ'గా గుర్తించి పర్యావరణ అనుమతి నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ.. ఆ నోటీసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ తమిళనాడు కాల్యుష్య నియంత్రణ మండలి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దీనిపై శుక్రవారం (ఫిబ్రవరి 28) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అంతేకాదు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు అభిప్రాయాన్ని సమర్ధించింది. TNPCB సవాలును తోసిపుచ్చింది. గత విచారణలో 2 సంవత్సరాల తర్వాత TNPCB ఈ ఉత్తర్వును ఎందుకు సవాలు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఈ అప్పీలును కొట్టివేస్తూ, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ప్రస్తుత కేసును ఒక ఉదాహరణగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో చేపట్టే ఏవైనా నిర్మాణాలకు, ఇషా ఫౌండేషన్ చట్ట ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు TNPCB తరపున తమిళనాడు అడ్వకేట్ జనరల్ పిఎస్ రామన్, ఇషా ఫౌండేషన్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.

కాగా, ఇషా ఫౌండేషన్‌కు చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. తన కుమార్తెలను ఆశ్రమంలో వారి ఇష్టానికి విరుద్ధంగా నిర్బంధించారని ఆరోపిస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ 2024 పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ఆ ఇద్దరు మహిళలు ఇషా కేంద్రంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని తేలటంతో కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే, ఆ సమయంలో దాదాపు 150 మంది పోలీసులు ఇషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేశారు.

Next Story