సంక్షోభం వేళ భారత్‌కు భారీ గుడ్‌న్యూస్.. హర్మూజ్‌తో పనిలేకుండానే చౌకగా ముడి చమురు!

by Kema Shiva Kumar |

ఓపెక్ కూటమికి యూఏఈ (UAE) గుడ్ బై చెప్పడంతో భారత్‌కు భారీ ఊరట లభించనుంది.

సంక్షోభం వేళ భారత్‌కు భారీ గుడ్‌న్యూస్.. హర్మూజ్‌తో పనిలేకుండానే చౌకగా ముడి చమురు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుందటున్నాయి. చమురు ఉత్పత్తి దేశాల శక్తివంతమైన కూటమి ఓపెక్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. ఈ పరిణామం ప్రపంచ చమురు రాజకీయాలను మార్చడమే కాకుండా, భారత్ వంటి పెద్ద చమురు దిగుమతి దేశాలకు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది.

భారత్‌కు భారీ ఊరట..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓపెక్ నుంచి బయటకు రావడం వల్ల భారత్‌కు ప్రధానంగా రెండు ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇప్పటివరకు ఓపెక్ నిర్దేశించిన కోటా (Production Caps) కారణంగా యూఏఈ తన సామర్థ్యం మేరకు చమురును ఉత్పత్తి చేయలేకపోయింది. ఇప్పుడు ఆ ఆంక్షలు ఉండవు కాబట్టి, యూఏఈ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతుంది. సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 9 నుంచి 10 శాతం యూఏఈ నుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, ఇది దేశ ఇంధన బిల్లును తగ్గిస్తుంది. అదేవిధంగాప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణా అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే సాగుతుంది. అయితే, యూఏఈకి ‘హబ్షాన్-ఫుజైరా’ (Habshan-Fujairah) పైప్‌లైన్ ఉంది. ఈ పైప్‌లైన్ అబుదాబి నుంచి నేరుగా ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు చమురును తీసుకెళ్తుంది. దీంతో హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండానే యూఏఈ చమురును అరేబియా సముద్రం ద్వారా నేరుగా భారత్‌కు పంపే అవకాశం ఉంది. యుద్ధం వంటి పరిస్థితుల్లో కూడా భారత్‌కు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ఉండదు.

యూఏఈ నిర్ణయానికి కారణం ఇదే..

యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 50 లక్షల బ్యారెళ్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, సౌదీ అరేబియా నేతృత్వంలోని ఓపెక్ కూటమి ధరలను స్థిరీకరించే పేరుతో ఉత్పత్తిపై ఆంక్షలు విధిస్తోంది. ఇది తమ ఆర్థిక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని యూఏఈ భావించింది. అందుకే సొంత నిర్ణయాలు తీసుకునేందుకు 60 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఇక భారత్ చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా సుమారు 11.4 శాతంగా ఉంది. సుమారు 400 కి.మీ పొడవైన హబ్షాన్-ఫుజైరా లైన్ ద్వారా ఇంధనం సురక్షితంగా సరఫరా భారత్‌ చేరనుండటంతో ఆర్థిక భారం తగ్గి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

Next Story