మహారాష్ట్ర ఓటర్ల లిస్టులో అవకతవకలు

by Ajay Maddhiboyina |

ఓటు వేయడానికి అర్హత కలిగి జనాభా కంటే ఓటర్లు ఎందుకు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నారో తెలియజేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ఓటర్ల లిస్టులో అవకతవకలు
X

- ఐదు నెల్లలో 39 లక్షల మంది కొత్త ఓటర్లు

- రాష్ట్రంలో పెద్ద వారి జనాభా కంటే ఓటర్లే ఎక్కువ

- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు

- లిఖిత పూర్వకంగా స్పందిస్తామన్న ఈసీఐ

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు జరిగాయి. ఆ రాష్ట్ర ఓటర్ల లిస్టును క్షణ్ణంగా పరిశీలిస్తే అనేక వ్యత్యాసాలు కనపడుతున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శివసేన(యూబీటీ) నాయకులు సంజయ్ రౌత్, ఎస్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతేడాది లోక్‌సభ ఎన్నికలకు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఉన్న 5 నెలల కాలంలో 39 మంది కొత్త ఓటర్లను లిస్టులో చేర్చడం అనుమానాస్పదంగా ఉందని రాహుల్ అన్నారు. మహారాష్ట్ర ఓటర్ల లిస్టును పూర్తిగా పరిశీలించిన తర్వాత అనేక అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షం గుర్తించిందని చెప్పారు. మహారాష్ట్రలో ఓటు వేయగలిగే వయసున్న వారు 9.54 లక్షల మంది మాత్రమే ఉండగా.. ఓటర్ లిస్టులో మాత్రం 9.7 కోట్ల మంది ఉన్నట్లు చూపిస్తోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల మధ్య ఐదేళ్ల కాలంలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఏకంగా 39 లక్షల మందిని చేర్చారు. ఈ 39 లక్షల మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఓటు వేయడానికి అర్హత కలిగి జనాభా కంటే ఓటర్లు ఎందుకు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నారో తెలియజేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈసీఐని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లిస్టును కోరాము. ఈ రెండు లిస్టులను దగ్గర పెట్టి పరిశీలిస్తే కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరనేది కచ్చితంగా అర్థమవుతుందని రాహుల్ చెప్పారు. ఎంత మంది ఓటర్లను తొలగించారు? ఎంత మందిని ఒక బూట్ నుంచి మరో బూత్‌కు మార్చారనే వివరాలు కూడా తెలుస్తుందని చెప్పారు. ఇంత వరకు ఈసీఐ మాకు ఓటర్ల జాబితాను ఇవ్వలేదు. ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదని రాహుల్ పేర్కొన్నారు.

లిఖితపూర్వకంగా స్పందిస్తాం : ఈసీఐ

మహారాష్ట్ర ఓటర్ జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీఐ స్పందించింది. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రశ్నలను, సూచనలను తాము గౌరవిస్తామని చెప్పింది. ఈ విషయంలో పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో లిఖితపూర్వకంగా స్పందిస్తామని ఈసీఐ వెల్లడించింది.

మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోబోతోంది. బీజేపీ మూడు దశాబ్దాల తర్వాత అధికారంలోకి రాబోతోంది. ఈ విషయాలపై దృష్టి మరల్చేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. ఇలాంటి విషయాల కంటే కాంగ్రస్ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలని ఫడ్నవీస్ సూచించారు.

Next Story